నారాయణ స్కూల్ యాజమాన్యానికి భయం లేదా..?
విద్యార్థి గాయపడినా భద్రతా చర్యలు శూన్యమేనా?
పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదంటున్న వార్డు కౌన్సిలర్
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:
ఆర్మూర్ పట్టణంలోని నారాయణ స్కూల్ వద్ద విద్యార్థుల భద్రతపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బుధవారం పాఠశాల ముగిసిన అనంతరం 9వ తరగతి విద్యార్థి కార్తీక్ రెడ్డిని ఆటో ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎంజే ఆసుపత్రికి తరలించగా తలకు కుట్లు వేసి చికిత్స అందించారు.పాఠశాల ముగిసే సమయంలో విద్యార్థుల భద్రత కోసం కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యాజమాన్యంపై లేదా? అంటూ స్థానిక వార్డు కౌన్సిలర్ బొట్టు రాజు తీవ్రంగా ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లపై యాజమాన్యానికి, ప్రిన్సిపాల్‌కు పలుమార్లు సూచించినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఘటన జరిగిన తర్వాతైనా యాజమాన్యం కళ్లు తెరిచి విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకుంటుందా? లేక మరో ప్రమాదం జరిగే వరకు చేతులు ముడుచుకుని కూర్చుంటుందా? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం లేకుండా అధికారులు పాఠశాల భద్రతా ఏర్పాట్లపై వెంటనే తనిఖీ చేసి, లోపాలు ఉంటే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.