గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా సురక్షితంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశం
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
రంగారెడ్డి, అక్షిత బ్యూరో :
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, ఘనంగా నిర్వహించాలి, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుతంగా, సురక్షితంగా ఉత్సవాలు నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు.
గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గణేష్ చవితి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ డా. కె. కిరణ్మయితో కలిసి డీసీపీలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 14న వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమై, 24న నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో పాటు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గణేష్ శోభాయాత్ర మార్గాల్లో గుంతలు, దెబ్బతిన్న రహదారులకు ప్యాచ్‌వర్క్ చేపట్టాలని, నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్లు, బారికేడింగ్, వేదికలు, మొబైల్ టాయిలెట్లు, తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు సమన్వయంతో ప్రతి ఉత్సవ కేంద్రాన్ని ముందుగానే పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ వైర్లు, కనెక్షన్లు తదితర అంశాలను విద్యుత్ శాఖ నిపుణుల సహకారంతో తనిఖీ చేయాలని సూచించారు. ఉత్సవ మండపాలు, విగ్రహాల ఏర్పాటు ప్రదేశాలను సురక్షితంగా ఎంపిక చేసి, అవసరమైన అనుమతులు తప్పనిసరిగా పొందాలని, మండపాల నిర్మాణం పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉత్సవాల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అన్నారు. మండపాల వద్ద పరిశుభ్రత, ఫాగింగ్, పారిశుద్ధ్య చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయాలని సూచించారు.
విగ్రహాల ఊరేగింపు సమయంలో వాహనాల్లో యాంత్రిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు తనిఖీలు చేపట్టాలని, నిమజ్జన మార్గాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు, వంగిన చెట్లు తదితర ప్రమాదకర అంశాలను తొలగించాలని తెలిపారు. చెరువుల వద్ద అవసరమైన సంఖ్యలో క్రేన్లు, బారికేడింగ్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, వైద్య, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు, కంట్రోల్ రూమ్, వేగవంతమైన స్పందన వ్యవస్థను ఏర్పాటు చేసి, ఎక్కడైనా సమస్య తలెత్తిన వెంటనే స్పందించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేసి గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో, ఎలాంటి ప్రమాదాలు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, నిమజ్జన ప్రదేశాల్లో తగినన్ని క్రేన్లు, నిరంతర విద్యుత్ సరఫరా, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) డాక్టర్ కె.కిరణ్మయి, జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి స్టేట్ ఎగ్జిక్యూటివ్ రవీందర్ రెడ్డి, బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఛైర్మన్ కె.నిరంజన్, సెక్రెటరీ సాయికిరణ్ చారి, వైస్ ప్రెసిడెంట్ టి.ఆనంద్ గౌడ్, ఆర్డీఓలు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్, మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.