అంకాపూర్‌లో శరవేగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు….!
ఆర్మూర్, అక్షిత ప్రతినిధి:
ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార చంద్రమోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకాపూర్ గ్రామంలో 22 ఎకరాల 7 గుంటల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతోందన్నారు. ఆదర్శ గ్రామమైన అంకాపూర్‌కు ఇలాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే అంకాపూర్‌తో పాటు పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుకారాం, ఏఎంసీ డైరెక్టర్ అమృత్ రావు, మాజీ ఎంపీటీసీ ఎంసీ గంగారెడ్డి, వార్డు సభ్యులు ముఖీం, కల్లం రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లేష్, గోపాల్, భూమేష్, స్వరూప్ రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.