వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి

వర్షాకాలంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి ­

– సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

– నగర మేయర్ కొలగాని శ్రీనివాస్

కరీంనగర్ అక్షిత బ్యూరో

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో పారిశుధ్య నిర్వహణ, దోమల నియంత్రణ, ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణపై కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ మున్సిపల్ అధికారులు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని పలు డివిజన్లలో నివాస గృహాల మధ్య, ఇళ్ల చుట్టుపక్కల ఉన్న ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వృద్ధి చెంది డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రతి డివిజన్‌లో జవాన్లు, పారిశుధ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి నీరు నిలిచే ఖాళీ స్థలాలను గుర్తించాలని సూచించారు. సంబంధిత స్థల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేసి, నీరు నిల్వ కాకుండా మట్టి లేదా మొరం నింపడం, కలుపు మొక్కలు, చెత్తాచెదారం తొలగించడం, అవసరమైన చోట నీటి ప్రవాహ మార్గాలను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్లక్ష్యం చేసే స్థల యజమానులపై మున్సిపల్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఖాళీ స్థలాలతో పాటు ఇళ్ల పరిసరాలు, నిర్మాణంలో ఉన్న భవనాలు, సెల్లార్లు, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, పూలకుండీలు, నీటి తొట్టెలు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, కూలర్లు తదితర ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని మేయర్ సూచించారు. ప్రధాన రహదారులు, అంతర్గత వీధులు, డ్రైనేజీలు, నాలాలు, కల్వర్టుల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను ముందుగానే తొలగించి వర్షపు నీరు సాఫీగా ప్రవహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా వాహనాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.దోమల నివారణకు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో “యాంటీ లార్వా మందుల పిచికారీ, ఫాగింగ్” కార్యక్రమాలను అవసరమైన మేరకు చేపట్టాలని ఆదేశించారు. పారిశుధ్య సమస్యలు, నీటి నిల్వకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు డివిజన్‌వారీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. చేపట్టిన పారిశుధ్య పనుల వివరాలను ఫొటోలతో సహా ప్రతిరోజూ ఉన్నతాధికారులకు సమర్పించాలని ఆదేశించారు.మున్సిపల్ పారిశుధ్య, ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాలు సమన్వయంతో పనిచేసి నగరంలో ఎక్కడా నీటి నిల్వలు, చెత్త పేరుకుపోవడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం వంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మేయర్ స్పష్టం చేశారు. అధికారులు కేవలం ఫిర్యాదులు వచ్చిన ప్రాంతాల్లోనే కాకుండా అన్ని డివిజన్లలో నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలని సూచించారు.ప్రజలు కూడా తమ ఇళ్లు, ఖాళీ స్థలాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సీజనల్ వ్యాధుల నివారణలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు.వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు, పారిశుధ్య ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఆదేశించారు.ఈ సమావేశం లో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అదనపు కమిషనర్లు సువార్థ, ఎన్.డి. అయాజ్,అసిస్టెంట్ కమిషనర్ రాజమనోహర్, శానిటరీ సూపర్‌వైజర్ శ్యామ్ రాజ్, వెటర్నరీ డాక్టర్ దుర్గాప్రసాద్, జవాన్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్లు స్వామి, రమేష్ మరియు అధికారులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking