*ఇన్‌స్టాలో బాలల దుర్వినియోగ కంటెంట్…*
*బామ్ని కె. గ్రామ యువకుడిపై కేసు నమోదు…*
*వీక్షించినా,షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవన్న లోకేశ్వరం ఎస్సై*
లోకేశ్వరం, సెప్టెంబర్ 5 (అక్షిత న్యూస్):
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన కంటెంట్‌ను వీక్షించడంతో పాటు వ్యాప్తి చేస్తున్న ఓ యువకుడిపై లోకేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బామ్ని కె. గ్రామానికి చెందిన తౌడు శ్రావణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బాలల అశ్లీల కంటెంట్‌ను బ్రౌజ్ చేయడం, డౌన్‌లోడ్ చేసి ఇతరులకు చేరవేస్తున్నట్లు సైబర్ నిఘా విభాగం గుర్తించింది. ఈ మేరకు నిందితుడిపై ఐటీ చట్టం-2000లోని సెక్షన్ 67(బి) కింద క్రైమ్ నం. 109/2026తో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి సోషల్ మీడియా ఖాతా నుంచి లభించిన డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లపై సైబర్ విభాగం నిరంతర నిఘా కొనసాగిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. బాలల లైంగిక కంటెంట్‌ను వెతకడం,చూడటం, డౌన్‌లోడ్ చేయడం, గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ‘కేవలం చూశాను మాత్రమే..పొరపాటున షేర్ చేశాను’వంటి సాకులు చట్టం ముందు చెల్లవని, డిజిటల్ ఆధారాలతో చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. అంతర్జాలంలో ఇలాంటి చట్టవ్యతిరేక కంటెంట్ కనిపిస్తే డౌన్‌లోడ్ చేయకుండా,పోలీసులకు లేదా జాతీయ సైబర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని లోకేశ్వరం ఎస్సై సూచించారు…