*నీట్‌లో సత్తా.. పూర్వ విద్యార్థిని సాయి చైతన్యకు ఘన సన్మానం…*
లోకేశ్వరం,సెప్టెంబర్ 5 అక్షిత న్యూస్ :
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని, జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)లో ప్రతిభ కనబరిచి ఎంబీబీఎస్ సీటు సాధించిన మెండె సాయి చైతన్యను స్థానిక నారాయణ పాఠశాల యాజమాన్యం శనివారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాతర్ల నారాయణ మాట్లాడుతూ.. తమ పాఠశాల పూర్వ విద్యార్థిని నీట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వైద్య విద్యకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. పట్టుదలతో శ్రమిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సాయి చైతన్య నిరూపించిందని కొనియాడారు. తోటి విద్యార్థులు ఆమెను ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
సాయి చైతన్య భవిష్యత్తులో ఉత్తమ వైద్యురాలిగా ఎదిగి సమాజానికి సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…