రామన్నపేట ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయాలి

ప్రభుత్వాలు మారుతున్నా.. ఏరియా ఆసుపత్రి సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు

బీఎస్పీ మండల అధ్యక్షుడు నకరేకంటి నరేష్

రామన్నపేట అక్షిత ప్రతినిధి 

రామన్నపేట ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రామన్నపేట మండల అధ్యక్షుడు నకరేకంటి నరేష్ డిమాండ్ చేశారు. ఏళ్లుగా ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రజలు, ప్రజా సంఘాలు ఆందోళనలు, దీక్షలు చేపడుతున్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.రామన్నపేట మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్యం అందించే ప్రధాన ఆసుపత్రిగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో అవసరమైన వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, ఇతర మౌలిక వసతులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.జ్వరం, కాళ్ల నొప్పులు వంటి సాధారణ అనారోగ్య సమస్యలకే నల్లగొండ, హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను దూర ప్రాంతాలకు తరలించే క్రమంలో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పలుమార్లు ఆసుపత్రి అభివృద్ధిపై హామీలు ఇచ్చినా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. సుమారు మూడు నెలల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రామన్నపేటకు వచ్చిన సందర్భంగా ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని నరేష్ కోరారు. రామన్నపేట ఏరియా ఆసుపత్రికి అవసరమైన కొత్త భవనం నిర్మాణంతో పాటు పూర్తి స్థాయి వైద్య సదుపాయాలు, వైద్యులు, సిబ్బంది, అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.“ప్రజల ప్రాణాలతో ముడిపడిన వైద్య సమస్యను ప్రభుత్వం ఇకపై నిర్లక్ష్యం చేయకూడదు. హామీలకే పరిమితం కాకుండా రామన్నపేట ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి” అని నకరేకంటి నరేష్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking