గ్రామాల్లో అభివృద్ధి శూన్యం.. పారిశుధ్యం అధ్వానం

గ్రామాల్లో అభివృద్ధి శూన్యం.. పారిశుధ్యం అధ్వానం

1000 రోజుల కాంగ్రెస్ పాలనలో పంచాయతీలు నిర్వీర్యం

మంచిరెడ్డి కిషన్ రెడ్డి

రంగా రెడ్డి అక్షిత బ్యూరో :

కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల అరాచక పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం రోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో పంచాయతీల విధ్వంసం, పడకేసిన పారిశుధ్యంపై నిర్వహించిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని పారిశుధ్య పరిస్థితులను, పేరుకుపోయిన చెత్తాచెదారం, అధ్వానంగా మారిన వ్యవస్థను పరిశీలించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు, పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగడం లేదని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల కోసం చేపట్టిన కార్యక్రమాలను నిర్వీర్యం చేసి గ్రామ పంచాయతీలను ఆర్థికంగా, పరిపాలనాపరంగా బలహీనపరిచారని ఆరోపించారు.గ్రామాల అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దౌర్భాగ్యపు పాలన సాగిస్తోందని అన్నారు. పారిశుధ్యం సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా 1000 రోజులు కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకే బీఆర్ఎస్ పోరుబాట చేపట్టిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking