గంగాధర చోరీ కేసులో మరో దొంగ అరెస్ట్.. బైక్ స్వాధీనం
గంగాధర అక్షిత న్యూస్
తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాలోని మరో నిందితుడు గజవెల్లి వంశీని గంగాధర పోలీసులు బుధవారం మధురానగర్‌లో అరెస్ట్ చేశారు. మరో చోరీకి పాల్పడే ఉద్దేశంతో మధురానగర్‌కు వచ్చిన సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.గంగాధర ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న కొండ శశికాంత్, సిహెచ్. సంతోష్, గజవెల్లి వంశీ తదితరులతో కూడిన ముఠాపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో పరారీలో ఉన్న నిందితుడు గజవెల్లి వంశీ మధురానగర్ పరిసర ప్రాంతాల్లో మరో చోరీకి ప్రయత్నించేందుకు వచ్చినట్లు సమాచారం అందగా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి మధురానగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహనాన్ని నేరానికి ఉపయోగించిన వాహనంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.విచారణలో గజవెల్లి వంశీ గతంలో కొండ శశికాంత్, సంతోష్ లతో కలిసి గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళం వేసిన ఇళ్లను రెక్కీ చేసి చోరీలకు పాల్పడినట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.మరో నిందితుడు సిహెచ్. సంతోష్ పరారీలో ఉన్నాడని, అతని ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎస్సై బి. వంశీకృష్ణ తెలిపారు.