ఢిల్లీలో తెలంగాణ ఉల్లాస్’కు ప్రశంసల జల్లు

ఢిల్లీలో తెలంగాణ ఉల్లాస్’కు ప్రశంసల జల్లు

లంబాడీ సంస్కృతి, అక్షరాస్యత కార్యక్రమాలకు ప్రత్యేక ఆకర్షణ

మందమర్రి, అక్షిత ప్రతినిధి:

అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా జవహర్ బాల్ భవన్, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఉల్లాస్ మేళా–నవభారత సాక్షరతా కార్యక్రమం’లో తెలంగాణ రాష్ట్ర స్టాల్ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణలో ఉల్లాస్ కార్యక్రమం ద్వారా చేపడుతున్న అక్షరాస్యత కార్యక్రమాలను కేంద్ర అధికారులు ప్రశంసించారు.కేంద్ర అడిషనల్ సెక్రటరీ అర్చనా శర్మ అవస్తి, ఐఏఎస్ తెలంగాణ రాష్ట్ర స్టాల్‌ను సందర్శించి, రాష్ట్రంలో ఉల్లాస్ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోందని అభినందించారు. తెలంగాణకు చెందిన లంబాడీ జానపద సంస్కృతి, స్థానిక గిరిజన అక్షరాస్యతా కార్యక్రమాలను ఆసక్తిగా వీక్షించారు. మహిళా వాలంటీర్లు నిర్వహిస్తున్న అక్షరాస్యత కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు.సి.ఎన్.సి.ఎల్ ప్రొఫెసర్ ఉషా శర్మ మాట్లాడుతూ ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులను సైతం ఉల్లాస్ వాలంటీర్లుగా భాగస్వాములను చేసి, అక్షరాస్యత అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.కాశిపేట మండలంలోని లంబాడీ తండాకు చెందిన ఉల్లాస్ వాలంటీర్ రాజేశ్వరి 312 మంది గ్రామస్థులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంతోపాటు, మరో 32 మందికి ఉచిత వృత్తి శిక్షణలో భాగంగా కుట్టు శిక్షణ అందించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమె సేవలను గుర్తించి సక్సెస్‌స్టోరీగా ఇంటర్వ్యూ చేసి అభినందించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లంబాడీ నృత్యం, బతుకమ్మ, బోనాలు, పోతురాజు ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. డిప్యూటీ డైరెక్టర్ పురుషోత్తం ఆధ్వర్యంలో డి.ఆర్.పీలు బండ శాంఖరి, శైలజ, రాజేశ్వరి, కవిత, జ్యోతి, భూమమ్మ, రాజు, హరిలాల్ తదితరులు నృత్య ప్రదర్శనలు నిర్వహించారు.డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మొహమ్మద్ నుమాన్ మాట్లాడుతూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి ఉల్లాస్ కార్యక్రమంలో ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు. వివిధ రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు, వినూత్న కార్యక్రమాలను ఈ మేళా ద్వారా తెలుసుకోవడం వల్ల వాటిలోని మంచి పద్ధతులను తెలంగాణలోనూ అమలు చేసి కార్యక్రమాల ఫలితాలను మరింత మెరుగుపరచవచ్చని తెలిపారు.రంగారెడ్డి జిల్లా డెప్యూటీ డైరెక్టర్ అనిత మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన ఉల్లాస్ సంబరాల్లో వివిధ రాష్ట్రాల విజయగాథలను తెలుసుకోవడం తెలంగాణ బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ స్ఫూర్తితో రాష్ట్రంలో ఉల్లాస్ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking