ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
కాజిపేట్,అక్షిత న్యూస్ :
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగ యువత నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం, అసలు విద్యా సర్టిఫికెట్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుడు మెట్టు ప్రవీణ్ కుమార్ (41), నిజామాబాద్ జిల్లా నివాసిగా గుర్తించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖలో వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మోసం చేసిన విధానం
నిందితుడు స్పోర్ట్స్, ఎన్ , సి,సు కోటా పేర్లతో ఉద్యోగాలు ఇప్పిస్తానని అభ్యర్థులను ఆకర్షించినట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వెబ్‌సైట్లు చూపిస్తూ, గతంలో జారీ అయిన ఉద్యోగ నియామక ఉత్తర్వులలో పేర్లు మార్చి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారు చేసి అభ్యర్థులకు చూపించినట్లు వెల్లడైంది.అంతేకాకుండా మోసం మరింత నమ్మదగినదిగా కనిపించేలా అభ్యర్థులకు మెడికల్ టెస్టులు, పోలీస్ వెరిఫికేషన్ వంటి ప్రక్రియలు నిర్వహించినట్లు నటించినట్లు పోలీసులు తెలిపారు. ఐటీ కోర్సులను ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన శిక్షణగా నమ్మించి పలువురు యువతను మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
గుర్తించిన బాధితులు – మోసం చేసిన మొత్తం
ఇప్పటివరకు గుర్తించిన బాధితుల నుంచి సుమారు రూ.85 లక్షల నగదు, 4 తులాల బంగారం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి అసలు విద్యా సర్టిఫికెట్లు, ఉద్యోగ సంబంధిత పత్రాలు కూడా తీసుకున్నట్లు వెల్లడైంది.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.18.22 లక్షల విలువైన నగదు ఇతర ఆస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.