ప్రకృతి ఆరాధన.. పల్లెల్లో పోలాల అమావాస్య సంబురాలు

ప్రకృతి ఆరాధన.. పల్లెల్లో పోలాల అమావాస్య సంబురాలు

ఘనంగా లోకేశ్వరంలో పశువుల పండుగ

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

అలంకరించిన జోడెద్దులతో ప్రదక్షిణలు చేసిన రైతులు

లోకేశ్వరం, సెప్టెంబర్ 10 అక్షిత న్యూస్ :

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచే మూగజీవాలను, ప్రకృతిని పూజించే సంస్కృతికి ప్రతీకగా నిలిచే పోలాల అమావాస్య వేడుకలు లోకేశ్వరం మండలంలో అత్యంత వైభవంగా జరిగాయి. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో రైతులు, ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడంతో పల్లెలో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ,పండుగ వాతావరణం సంతరించుకున్నాయి.

ముస్తాబైన పశు సంపద.. ప్రత్యేక పూజలు

పండుగ రోజు ఉదయం నుంచే రైతుల ఇళ్లలో సందడి నెలకొంది. వ్యవసాయంలో తమకు చేదోడు వాదోడుగా ఉండే పశువులను రైతులు అపురూపంగా చూసుకున్నారు.ఎద్దులను శుభ్రంగా కడిగి, రంగురంగుల అలంకరణలు,కాళ్లకు గజ్జెలు,మెడలో పూలమాలలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.అలాగే నాగలి,గొర్రు తదితర వ్యవసాయ పనిముట్లను శుభ్రపరిచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని,పశుసంపద ఆరోగ్యంగా వర్ధిల్లాలని గ్రామదేవతలను,ప్రకృతిని వేడుకున్నారు.

శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు

సాయంత్రం వేళ వేడుకలు మరింత జోరందుకున్నాయి. అందంగా అలంకరించిన జోడెద్దులను డప్పు చప్పుళ్లు, మంగళవాయిద్యాల నడుమ గ్రామంలోని శివాలయం,హనుమాన్ ఆలయాల వద్దకు ఘనంగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ‘హర హర మహాదేవ’ అంటూ శివనామస్మరణ చేస్తూ భక్తులు ఆలయాల చుట్టూ జోడెద్దులతో ప్రదక్షిణలు చేయించారు.ఈ వేడుకల్లో మహిళలు సైతం సంప్రదాయ ఆచారాలను పాటిస్తూ ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు ఆచరించారు.ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని కాపాడుతూ అన్నదాతలు జరుపుకున్న ఈ పండుగ స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది…

Leave A Reply

Your email address will not be published.

Breaking