తెలంగాణలో బీజేపీ ఒక చెల్లని రూపాయి : ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
రాష్ట్రంలో బీజేపీ ఒక చెల్లని రూపాయి అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని పిచ్చికూతలు కూస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు. బీజేపీ దొంగల పార్టీ అని విరుచుపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం ఒక్కపైసా ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే వివేకానందతో కలిసి జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పొలిటికల్ సూపర్‌స్టార్ అని చెప్పారు. కేంద్రం ఏ వర్గానికి మేలు చేసిందో ప్రధాని మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు..ఇక్కడి వనరులపై మోదీ దృష్టి పెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని చూసి మోదీ సహా బీజేపీ ముఖ్య నేతలు నేర్చుకోవాలని సూచించారు. ఈస్టిండియా కంపెనీ దేశాన్ని దోచుకున్నట్టు మోదీ ఆధ్వర్యంలోని నార్త్ ఇండియా కంపెనీ తెలంగాణను దోచుకోవడానికి వచ్చిందని చెప్పారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గుజరాత్‌కు వెళ్తే రిసీవ్ చేసుకోలేదని విమర్శించారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చడమే బీజేపీ పనిగా పెట్టుకున్నదని ఫైరయ్యారు. ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని వెల్లడించారు.