ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్
–భారీ నుండి అతి భారీ వర్ష సూచన
-అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
వాతావరణ శాఖ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిందని భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ నుండి కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచన చేశారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు అట్టి ప్రదేశాల్లో నిరంతర పర్యవేక్షన చేస్తూ బాధ్యత గల అధికారిని నియమించి పరిస్థితులను ఎదుర్కొనేలా ప్రత్యెక చర్యలు చేపట్టాలన్నారు. రెవిన్యూ ఇర్రిగేషన్ పిఆర్ ఆర్ అండ్ బి ఇర్రిగేషన్ ఇంజనీర్లు మునిసిపల్ పోలీస్,ఞ విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ఏఇ లకు వారి వారి పరిధిలోని చెరువులు కుంటలు నీటి వనరులపై పూర్తి అవగాహన వుండాలన్నారు. వర్షాలు గాలులకు చెట్లు పడిపోయే ప్రమాదం ఉన్నందున పడిపోయిన చెట్లను వెంటనే తొలగించేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగే ఆస్కారం ఉన్నచోట విద్యుత్ సరఫరా నిలిపివేత ప్రత్యామ్నాయ చర్యలు వెంట వెంట చేపట్టాలన్నారు. వాగులు పొంగిపొర్లి కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమై రాకపోకలు నిలిచిన గ్రామాల్లోని ప్రసవ సమయమున్న గర్భిణులకు ముందే అనువైన ప్రదేశానికి తరలించడం వున్నచోట సరైనా వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపట్టడం చేయాలన్నారు. ప్రమాదానికి ఆస్కారం వుండి అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు.శిధిలావస్థలో వున్న ఇండ్లు భవనాలు గుర్తించి అందులో వున్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. లోతట్టు ముంపు గ్రామాల వారిని తరలించుటకు పునరావాస కేంద్రాలు గుర్తించాలని అట్టి కేంద్రాలలో కనీస వసతులు భోజన ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. ప్రతి రెండు గంటలకు పరిస్థితిపై నివేదిక సమర్పించాలన్నారు. భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదురైతే 24×7 పనిచేసే కంట్రోల్ రూమ్ నెంబర్ టోల్ ఫ్రీ నెం. 1077, 9063211298 లకు ఫోన్ చేసి సహాయాన్ని పొందవచ్చని ప్రజలకు కలెక్టర్ సూచించారు. మండలాల వారిగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రణాళిక రూపొందించాలని మండలాల ప్రణాళిక క్రోడీకరించి జిల్లా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకొని ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సన్నద్దంగా వుండాలని కలెక్టర్ తెలిపారు.