*
ఎత్తైన కీలుమాంజారో పర్వతాన్ని అధిరోహించిన సమాచార శాఖ ఉద్యోగి నితిన్*
*కీలుమంజారో పై వజ్రోత్సవ 75 అడుగుల పతాకాన్ని ఆవిష్కరించిన నితిన్*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి : ప్రపంచంలోనే నాలుగవ అత్యంత ఎత్తైన కీలుమాంజారో పర్వతాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ఉద్యోగి యేముల నితిన్ విజయవంతంగా అధిరోహించి భారత స్వాతంత్ర వజ్రోత్సవాల గుర్తుగా 75 అడుగుల భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. హైదరాబాద్ లోని సమాచార శాఖ కార్య నిర్వాహక ఇంజనీరు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువకుడైన నితిన్ ఆగస్టు 14 వతేదీన ఉదయం 7 .15 గంటలకు 5895 మీటర్ల ఎత్తైన (19341 అడుగులు ) కీలుమంజారో పర్వతాన్ని సునాయాసంగా అధిరోహించాడు. ఉధృతమైన గాలులు, అతి తక్కువ ఉష్టోగ్రత తో నిటారుగా ఉండే కీలుమాంజారో పర్వతం ప్రమాదకరంగా ఉంటుంది. ఎంతోశిక్షణ పొందిన పర్వతారోహకులు మాత్రమే ఈ పర్వతాన్ని అధిరోహించగలుగుతారు. అటువంటి ప్రమాదకరమైన కీలుమాంజారో పర్వతాన్నిఅత్యంత సునాయాసంగా అధిరోహించడంతో పాటు భారత జాతీయ స్ఫూర్తిని చాటేలా వజ్రోత్సవ వేళ 75 అడుగుల జండాను పర్వత శిఖరాగ్రంపై ఎగురవేసి మొత్తం భారత జాతి కీర్తి ప్రతిష్టలను పెంపొందించాడు.
కాగా, అత్యంత సాహాసోపేతంగా కీలుమాంజారో పర్వతాన్ని అధిరోహించడమే కాకుండా, దానిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఖ్యాతిని పెంపొందించిన యేముల నితిన్ ను సమాచార పౌర సంబంధాల కమీషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అభినందించారు. ఎత్తైన పర్వతంపై 75 అడుగుల పతాకాన్ని ఎగురవేయడం ద్వారా సమాచార శాఖతో పాటు తెలంగాణా రాష్ట్ర గౌరవాన్ని పెంచాడని ప్రశంసించారు. కాగా, నితిన్ ను సమాచార శాఖ డైరెక్టర్ బీ. రాజమౌళి తోసహా పలువురు సీనియర్ అధికారులు అభినందించారు.