కిక్కిరిసిన ప్రజాదీవెన

★ మునుగోడు సభ సూపర్‌ హిట్‌

★ అంచనాలకు మించి తరలొచ్చిన జనం

★ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి స్పీచ్‌కు హర్షధ్వానాలు

మునుగోడు, అక్షిత ప్రతినిధి :

మునుగోడు ప్రజాదీవెన సభ ఆద్యంతం ఉత్సాహభరితంగా సూపర్‌ హిట్‌గా కొనసాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనదైన శైలిలో ప్రసంగిస్తూ సభకు వచ్చిన ప్రజలను మంత్రముగ్ధులను చేశారు. అంశాలవారీగా ప్రశ్నలు సంధిస్తూ, సభికుల నుంచి సమాధానాలు రాబడుతూ, ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రసంగాన్ని కొనసాగించారు. బీజేపీ ఎంత ప్రమాదకరమో వివరిస్తూ.. మునుగోడులో ఆ పార్టీకి ఎలా బుద్ధి చెప్పాలో దిశానిర్దేశం చేయడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులతోపాటు సభకు తరలివచ్చిన సామాన్యులు సైతం కదన కుతూహలంతో వెనుదిరిగారు. అంచనాలకు మించి జనం తరలిరావడంతో మునుగోడులో టీఆర్‌ఎస్‌ ప్రజాదీవెన సభ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

కిక్కిరిసిన సభా ప్రాంగణం
——————————–
సీఎం కేసీఆర్‌ను చూసేందుకు, ఆయన ప్రసంగం వినేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సభా ప్రాంగణానికి జనప్రవాహం మొదలైంది. గంటలోపే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలతో తరలివచ్చారు. కొందరు మహిళలు బోనం కుండలను నెత్తిన పెట్టుకుని గాయకుడు సాయిచంద్‌ పాడిన పాటలకు కోలాటం ఆడుతూ సభను హోరెత్తించారు. ప్రశ్నలు, సమాధానాలు.. సామెతలు, పంచ్‌లతో ప్రజలు ఆలోచించేలా ముఖ్యమంత్రి ప్రసంగం సాగింది. ముఖంపై ఎదురెండ పడి ఇబ్బంది అవుతున్నా.. ప్రసంగం చివరివరకూ లేవకుండా సభలో లీనమైపోయారు.

సీఎం ప్రసంగానికి ప్రజలు ఫిదా
————————————
సీఎం కేసీఆర్‌ ప్రసంగానికి మునుగోను ప్రజానీకం ఫిదా అయ్యింది. ‘బీజేపీతో మన బతుకులు ఆగమైతయ్‌.. ఓటు వేసేటప్పుడు ఏమరుపాటు వద్దు.. క్రియాశీల, ప్రగతిశీల శక్తుల బలమేంటో దేశానికి చాటిచెప్పాలంటూ’ కేసీఆర్‌ మాట్లాడినప్పుడల్లా హర్షద్వానాలు చేశారు. ఫ్లోరైడ్‌ గురించి ప్రస్తావిస్తూ తాను స్వయంగా శివన్నగూడెంలో నిద్ర చేశానన్నప్పుడు జనం చప్పట్లతో స్పందించారు. సీపీఐ, సీపీఎం మద్దతు గురించి ప్రస్తావిస్తూ ప్రగతిశీల శక్తులు ఏకం కావాలని చెప్పినప్పుడు హర్షధ్వానాలతో స్వాగతించారు. బాయి కాడ మీటర్‌ పెట్టమంటే.. ‘నేను సచ్చినా పెట్టనని చెప్పా..’ అంటూ కేసీఆర్‌ అన్నప్పుడు ఈలలు, చప్పట్లు మార్మోగాయి.

దారిపొడవునా జేజేలు
——————————-
హైదరాబాద్‌ నుంచి మునుగోడు వరకు దారిపొడవునా జై తెలంగాణ.. జై కేసీఆర్‌ నినాదాలతో మార్మోగింది. ఆడబిడ్డలు మంగళహారతులు పట్టారు. మునుగోడు ప్రజాదీవెన బహిరంగసభకు హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌ నుంచి శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరారు. బేగంపేట నుంచి మునుగోడు దాకా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు అడగడుగునా అధినేతకు స్వాగతం పలికారు. బస్సులో నుంచి సీఎం కేసీఆర్‌ ప్రజలకు అభివాదం చేశారు. హైదరాబాద్‌ నుంచి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ని అనుసరించారు. ఉప్పల్‌ నుంచి నాగోల్‌, ఎల్బీనగర్‌, ఓఆర్‌ఆర్‌ (విజయవాడ హైవే) మీదుగా చౌటుప్పల్‌, నారాయణపురం, మునుగోడు సభా ప్రాంగణం దాకా భారీ కాన్వాయ్‌ సాగింది. మంత్రి చామకూర మల్లారెడ్డి తన వాహనంపై నిలబడి చేసిన నృత్యం కార్యకర్తలు, నాయకుల్లో జోష్‌ నింపింది. మునుగోడు సభకు సీఎం కేసీఆర్‌తో పాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన రైతు నాయకులు హాజరయ్యారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి రైతు నాయకులు సీఎం కేసీఆర్‌తో కలిసి బస్సులో మునుగోడుకు వెళ్లారు. ఢిల్లీ నుంచి రవి కోహెర్‌, శివాంక్‌యాదవ్‌, ఉత్తరప్రదేశ్‌ మొరాబాద్‌ నుంచి అంకిత్‌యాదవ్‌, పాట్నా నుంచి హిమాన్షు తివారి, భువనేశ్వర్‌ నుంచి అక్షయ్‌కుమార్‌ హాజరయ్యారు.

కేసీఆర్‌ కృషితోనే ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి
————————————–
మునుగోడు ప్రజలు ఏండ్లపాటు ఫ్లోరైడ్‌ నీటిని తాగి కాళ్లు, చేతులు వంకరపోయి దివ్యాంగులుగా మారడానికి కారణం నాటి సమైక్య పాలకులు చేసిన ద్రోహమేనని, సీఎం కేసీఆర్‌ పాలనలో ఫ్లోరైడ్‌ రక్కసి నుంచి శాశ్వత విముక్తి లభించిందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నాడు మునుగోడు ప్రాంతంలోని ఏ ఒక్కరి ముఖంలో చిరునవ్వు కనపడేది కాదన్నారు. స్వరాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం ఆయ్యాక ఆ ఫ్లోరైడ్‌ను తరిమి కొడుతూ ఇంటింటికీ శుద్ధ జలాలు ఇవ్వడం వల్లే నేడు వేల మందిలో సంతోషం కనిపిస్తున్నదని స్పష్టంచేశారు. తమ ఇంటి పెద్ద కేసీఆర్‌ మునుగోడుకు వస్తున్నాడన్న ఆనందంలో ఇక్కడి ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలి రావడం సంతోషకరమని చెప్పారు.

టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే బీజేపీ తరిమివేత
————————————–
దేశ, రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి చెప్పారు. సీపీఐ శ్రేణులన్నీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాదీవెన సభకు హాజరైన పల్లా వెంకట్‌రెడ్డి సీపీఐ తరఫున టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మునుగోడులో సీపీఐ పోటీ చేస్తే అభివృద్ధి నిరోధకులు, మతతత్వ వాదులకు అవకాశం ఇచ్చినట్టవుతుందనే పోటీకి దూరంగా ఉంటున్నట్లు స్పష్టంచేశారు. టీఆర్‌ఎస్‌ మద్దతుతోనే బీజేపీ తరిమివేత సాధ్యమని చెప్పారు.రాజగోపాల్‌రెడ్డిని మూడేండ్ల కింద మద్దతిచ్చి గెలిపిస్తే ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని విమర్శించారు. అభివృద్ధి నిరోధక బీజేపీలోకి వెళ్లాడని ధ్వజమెత్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking