సీఎం కేసీఆర్ ని తెలంగాణ వదులుకోదు
..
బీహార్ సీఎం నీతీశ్ కుమార్ ప్రశంసల వర్షం
బీహార్ :
అమర వీరుల కుటుంబాలతో పాటు సికింద్రాబాద్ ప్రమాద బాధితుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. బిహార్ పర్యటనలో భాగంగా పట్నా చేరుకున్న ఆయనకు బిహార్ సీఎం నీతీశ్ కుమార్ స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున అమరుల కుటుంబాలకు నీతీశ్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. అమర వీర సైనికుల కుటుంబాలకు కేంద్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా ఉండాలని సీఎం నితీష్ అన్నారు. ఏ రాష్ట్రం ముందుకు రాకపోయినా తెలంగాణ ప్రభుత్వం తమ వంతుగా అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడటం గొప్ప విషయమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వంగా నిలిచిందని కొనియాడారు..కేసీఆర్ సారథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశాన్నే ఆశ్చర్యపరుస్తున్నాయని అన్నారు. కేసీఆర్ ఏ విషయాన్నైనా క్షుణ్నంగా అర్థం చేసుకుంటారని, ప్రతి విషయంలో పట్టు సాధిస్తారని కొనియాడారు. తెలంగాణలో మిషన్ భగీరథ పథకం చాలా గొప్పదని, ఆ పథకాన్ని ఎలా చేశారో చూసి రావాలని బిహార్ అధికారులను పురమాయించిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం చాలా గొప్ప కార్యక్రమమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి కేసీఆర్. అలాంటి వ్యక్తిని తెలంగాణ ప్రజలు వదులుకుంటారా?’ అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. బీజేపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.