అగ్గి రాజుకున్నది.. బీజేపీతో తాడోపేడో
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
8 ఏండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో కేసీఆర్.. బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతో చాలారోజుల పాటు సత్సంబంధాలను కొనసాగిస్తూ వచ్చారు. అనేక విషయాల్లో మోడీ ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చారు. కానీ, ఉన్నతస్థాయిలో సత్సంబంధాలను కొనసాగిస్తున్నట్టు నటిస్తూనే.. తెలంగాణకు ప్రయోజనం కలిగించే విషయంలో అది నోటితో నవ్వి నొసటితో వెక్కిరించే ధోరణిని ఎంచుకున్నది. ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడం, తెలంగాణ ప్రాజెక్టులకు పైసా సాయం చేయకపోవడం, విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడం, ఆర్థిక సంఘం సిఫారసులను బుట్టదాఖలు చేయడం, చివరికి అప్పులు కూడా తెచ్చుకోకుండా ఎఫ్‌ఆర్‌బీఎం ఆంక్షలు విధించడం, సంస్కరణల పేరుతో తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే నిబంధనలు తీసుకురావడం, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా దాష్టీకం చెలాయించడం.. వీటన్నింటితో మోడీ సర్కారు గుంట నక్క వైఖరిని కేసీఆర్ పసిగట్టారు. ప్రాణాలకు తెగించి తెచ్చుకున్న తెలంగాణను తన మార్గంలో తాను అభివృద్ధి చేసుకుంటుంటే దాన్ని కూడా దెబ్బతీయడం ఏమిటని కేసీఆర్ ఆలోచించారు. మంచిగా ఉన్నట్టు నటిస్తూనే వెన్నుపోటు పొడిచే బీజేపీ నైజాన్ని కేసీఆర్ గ్రహించారు. తన రాజకీయ భవిష్యత్ కోసం తెలంగాణలో మత కల్లోలాలు రేపడానికి బీజేపీ నేతల రహస్య ప్రణాళికలకు అడ్డుకట్ట వేశారు. బీజేపీ నేతల సిగ్గుఎగ్గులేని విద్వేష వ్యాఖ్యలను ప్రజల ఎదుట ఎండగట్టారు. దేశ భవిష్యత్ విషయంలో ఇక రాజీ పడకూడదని కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడమే మంచిదని భావించారు. దీనికి దేశ రాజకీయాల్లోకి రావడమే మార్గమని బీజేపీతో రణానికి సిద్ధమయ్యారు.