దారంతా మువ్వన్నెల మురిపెం

దారంతా మువ్వన్నెల మురిపెం

జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు సక్సెస్…!

భారీ బహిరంగ సభ…!

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శనలు..!
తెలంగాణ ప్రాంతానికి ప్రత్వేక చరిత్ర
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి…!
ఎంఎల్ ఏ నలమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ దారులన్నీ మువ్వన్నెల మురిపెంతో నిండిపోయాయి. వేలాది మంది మువ్వన్నెల జెండాలతో ర్యాలీలో భాగస్వాములయ్యారు.తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు వేడుకల్లో భాగంగా శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలు సక్సెస్ అయ్యాయి. జాతీయ జెండాలతో వేలాది మంది స్టూడెంట్స్, స్థానిక ప్రజలతో చేపట్టిన భారీ ర్యాలీని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, ఆర్డీవో రోహిత్ సింగ్, డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ప్రారంభించారు. డప్పు వాయిద్యాల నడుమ ప్రారంభమైన ర్యాలీ రాజీవ్ చౌక్ మీదుగా శకుంతల టాకీస్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నుంచి ఎన్ఎస్పి గ్రౌండ్ వరకు చేరుకుంది. అనంతరం ఆర్డీవో రోహిత్ సింగ్ అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. సభకు విచ్చేసిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సెక్రటేరియట్ కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షిస్తూ ఆయన చిత్ర పటానికి, సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభి షేకం చేశారు. ఈ సందర్భంగా గుత్తా మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహించడం గొప్ప విషయమన్నారు. దేశానికి స్వతంత్రం 1947 లో వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. నైజాం పాలన సమయంలో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాల ఫలితంగా స్వాతంత్రం వచ్చిందన్నారు. మద్రాస్ నుంచి విడిపోయిన ఏపీ ప్రాంతంలోని కొంత మంది నేతలు తెలంగాణ వనరులపై కన్నేసి ఈ మన ప్రాంత వనరుల దోపిడి చేశారన్నారు. 60 ఏళ్ల పాటు ఇక్కడి ప్రజలు పోరాటం చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రవేశ పెట్టిన ఆర్టికల్_3 ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించిన ఉద్యమ నేత సీఎం కేసీ ఆర్ ..రాష్ట్రంలో సాగునీటి అభివృధ్ది, ఉచిత కరెంట్, ఇతర పథకాలతో దేశంలో రాష్ట్రాన్ని ముందు వరసలో ఉంచారన్నారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని ఓర్వలేక కొన్ని జాతీయ పార్టీలు కుట్రలకు తెరతీశా యన్నారు. ప్రజలు గ్రహించాలన్నారు.

సభకు వచ్చిన 20
వేల మందికి బోజనాలు..!

కాగా జాతీయ సమైక్యత సభకు వచ్చిన సుమారు 20 వేల మందికి బోజనాలు, వాటర్, బిస్కెట్స్ అందజేశారు. సభలో విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్,మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, బాలు నాయక్, దుర్గంపూడి నారాయణరెడ్డి, తహసిల్దార్ అనిల్ కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చిట్టిబాబు నాయక్, వింజం శ్రీధర్, మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు కర్నాటి రమేశ్, వెంకట రమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

వేడుకల్లో అపశృతి…!

కాగా స్థానిక ఎన్నేస్పీ క్యాంప్ లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. సభలో ఏర్పాటు చేసిన ఎల్ ఈ డీ స్క్రీన్ నిర్మాణం ముందు వరసలో ఉన్న విద్యార్థుల పై పడింది. ఈ ప్రమాదంలో కాక తీయ స్కూల్ విద్యార్ధులు ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా పోలీస్ వాహనంలో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. స్వల్ప గాయాలే కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారు. కాగా ప్రైవేట్ హాస్పిటల్ లో ఉన్న విద్యార్థులను పరామర్షించేందుకు వెళ్లిన కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి ని పోలీసులు అడ్డుకోవడం కొంత ఉద్రిక్తతకు దారి తీసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking