మునుగోడు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులను నిలదీయండి!!
*చర్లగూడెం భూ నిర్వాసితులకు అండగా
*పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు అండగా
*పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రొఫెసర్. గడ్డం లక్ష్మణ్
మునుగోడు, అక్షిత ప్రతినిధి:
మునుగోడు మండల కేంద్రంలో స్థానిక సత్య ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో, రాజకీయపార్టీలు ప్రజాస్వామిక విలువలను . దిగజారుస్తూ “ఓటు’ను అంగడి సరుకుగా మార్చివేస్తున్న, తరుణం లో ప్రజల సమస్యలను తిరిగి తెరమీదికి తేవడానికి మునుగోడు నియోజిక వర్గంలోని వివిధ గ్రామాలను సందర్శించి, వివిధ ప్రజా సమూహాల యొక్క సమస్యలను గుర్తించి పత్రికాముఖంగా, రాజకీయ పార్టీలకు వారి భాధ్యతలను గుర్తుచేస్తూ, ప్రజల ఎజెండాను వారి ముందుకు తెస్తున్నామన్నారు.
పౌరహక్కుల సంఘం ప్రత్యక్షంగా ప్రజలతో సంభాషించడానికి మునుగోడు నియోజకవర్గంలో మర్రిగూడ మండలంలోని మర్రిగూడ, రాజంపేట తాండ, చర్లగూడ, వెంకిపల్లి, వెంకేపల్లి తాండ, శివన్నగూడ గ్రామాలను మరియు సంస్థాన్ నారాయణ పురం మండలం, తూముబాయి తండా, రాచకొండ, అల్లా,పూర్ సంస్థాన్ నారాయణ పురం పుట్టపాక మరియు మునుగోడు గ్రాములను సందర్శించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నాం.
ప్రజలతో పౌరహక్కుల సంఘం జరిపిన చర్చలలో ప్రజలు వారి సమస్యలను తెలుపుతూ, వాటికి పరిష్కార మార్గాలు కూడా తెలియజేయడం జరిగింది. కాని రాజకీయ పార్టీలు మాత్రం పరిష్కార మార్గాల జోలికి వెళ్ళకుండా ప్రజలను మత్తులో,డబ్బుల సంచులతో ఓట్లను కొనుగోల్లు చేయాలని రకరకాల ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలు పౌరహక్కుల సంఘం దృష్టికి తెచ్చిన ప్రధాన సమస్యలు
1. చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల జీవన్మరణ సమస్య: ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చర్లగూడ, వెంకిపల్లి వెంకిపల్లితాండ, నర్సిరెడ్డి గూడ తదితర గ్రామాల ప్రజల యొక్క సాగు భూములను సేకరించడం జరిగింది. ఈ నాలుగు గ్రామాలు పూర్తిగా ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నాయి. ప్రభుత్వం ఈ గ్రామాల రైతుల నుండి బలవంతంగా భూసేకరణ చేసి, రైతులకు నామమాత్రంగా పరిహరం అనగా ఎకరాకు 4 లక్షల 15 వేలు మరియు 5లక్షల 15 వేలు రూపాయలు మాత్రమే చెల్లించింది. కాని మార్కెట్ రేట్ ప్రకారం ఇక్కడ పరిహారం అందుకున్న రైతులు ప్రభుత్వమిచ్చిన పరిహారంతో కనీసం 100 గజాల ఇళ్ళ స్థలం కూడా కొనలేని స్థితికి భూముల ధరలు ఆకాశనంటుతున్నాయి.
మునుగోడు ఉపఎన్నిక ఏజెండాకు రానంతకాలం నిర్వాసితుల సమస్యలు పట్టించుకున్న నాథుడే లేడు ఉపఎన్నిక తరుణంలో నామమాత్రం పరిహరం చెల్లించి మాకు ఓట్లేస్తేమెరుగైన “పరిహరం ” ఇస్తామని ప్రజలను ఇంకా బ్రమల్లోనే ముంచుతున్నది. దీనిని పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది.
2. పోడు భూముల సమస్య….తూముబాయి తండా, రాచకొండ తండా అల్లాపూర్, ఎనగంటితండా కడీలబాయితండా , ఐద్దోనితండా ,సీపీ తండా,పాలగుట్ట తండా, పొర్లగడ్డతండా ఎంకంబాయి తండా అల్లపురం మరియు నారాయణపూర్ గ్రామాల ప్రజులు తరతరాలుగా సాగుచేసు కుంటున్న భూములను అటవీ అధికారులు బలవంతంగా గుంజుకొని. వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారు. “భూమే” జీవనాధారమై నందున ఆ భూముల నుండి మమ్మల్ని బేదఖలు చేస్తే మేము బతికేది “ఎట్లా” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు మెరుగైన జీవితాలకు బరోసానిచ్చెందుకు కృషి చేయవలసిన ప్రభుత్వాలు వారి జీవితాలనే ఛిద్రం చేస్తున్న ఘటన పోడు గ్రామాలలో ఉన్నది సాగు చేసుకుంటున్నా.
రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేస్తున్నారు . ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన రాజకీయ పార్టీలు పోడు భూముల సమస్యలను పట్టించుకోవడం లేదు తరతరాలుగా సాగు చేసుకుంటున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు
3.ఫ్లోరైడ్ సమస్య తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చిన ఫ్లోరైడ్ సమస్య పాక్షికంగానే పరిష్కరించబడింది అని ప్రజలు తెలియజేశారు ఫ్లోరైడు తో వికలాంగులైన వారికి సరైన ఉపాధి అవకాశాలను కల్పించాలి తాగునీటి సమస్య ఈ మేరకు పరిష్కరించ బడిన అప్పటికిని శాశ్వతంగా నివారణ కాలేదు పంటపొలాలను ఈ సమస్య నుండి కాపాడాలి.
4.చేనేత కార్మికుల వెతలు చేనేత కార్మికులు పూల ధరలు ముడి సరుకుల ధరలు అమ్మకాలు గిట్టుబాటు లేకపోవడం సంబంధించిన చట్రంలో ఇరుక్కొని కొట్టుమిట్టాడుతున్నారు పుట్టపాక మొదలైన గ్రామాలలో వందల కుటుంబాలు ఈ చేనేత రంగంపై ఆధారపడి ఇస్తున్నారు మునుగోడు నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు . అయినా కానీ రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు పవర్ రూములు రాజ్యమేలుతున్న ఆధునిక కాలంలో చేనేతపై ఆధారపడిన జీవితాలు దుర్భర పరిస్థితుల్లో విలవిలలాడుతున్నాయి .
రాజకీయ నాయకుల ప్రచార హోరు వాడ వాడ లో మార్మోగుతుంది .తెలంగాణ TRS అధికార పార్టీ తన మంత్రులను, ఎమ్మెల్యేలను ,ఇతర ప్రజా ప్రతినిధులను మునుగోడు లో దింపి ప్రచారం ఉధృతంగా చేస్తుంది. కాంగ్రెస్ బిజెపి తదితరులు కూడా ప్రజలను గుక్కతిప్పుకోకుండా ప్రచారం చేస్తున్నారు,కానీ వారి సభలు సమావేశాలు ప్రసంగాలతో ప్రజల క్షేత్ర స్థాయి సమస్యలను ప్రస్తావించడం లేదు. గ్రామాలను అనుసంధానం చేసే విధంగా రవాణా వ్యవస్థ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నది.విద్యా మరియు వైద్యం రంగం
అందని ద్రాక్ష అయ్యింది.తండాలోనిగర్భిణీ స్త్రీలు వైద్య సదుపాయాలు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు తూము బాయితండాకు చెందిన భాగ్య అనే మహిళ 15 కిలోమీటర్ల దూరంలోని ఆసుపత్రికి చేరుకునేలోపే మార్గమధ్యంలో ప్రసవించింది .
విద్యార్థులు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది బాలిక విద్యార్థినిలు దూరప్రాంతాలకు వెళ్లలేక మధ్యలోనే చదువులు ఆపివేస్తున్నారు.
గురుకులాలు అందుబాటులో లేవు.
డిమాండ్లు.
*చర్లగూడ ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి .తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన 123 జీవో ను రద్దు చేయాలి. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు శాశ్వత పట్టాలు అందజేయాలి. అటవీ అధికారుల పోలీసుల దాడులను నిలిపివేయాలి.
*చేనేత కార్మికుల సబ్సిడీ పెంచాలి , విస్తరించాలి. ప్రభుత్వము నేరుగా చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. బతుకమ్మ చీరలను ఉత్పత్తికి చేనేత నేతన్నలకు అప్పగించాలి.
* ఫ్లోరైడు వికలాంగ బాధితులకు నెలకు పదివేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
* ఫ్లోరోసిస్ సమస్యకు శాశ్వత పరిష్కారం మార్గాలు చేపట్టాలి.సాగునీటి వల్ల వ్యవసాయ పంటల లో ఉన్న ఫ్లోరైడ్ తొలగించుటకు ఒక పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి..
* గ్రామ పంచాయతీలకు నిధులు పెంచాలి ఏర్పాటైన తండా పంచాయతీలకు ప్రత్యేక నిధులతో తండాలను అభివృద్ధి పరచాలి .
*ప్రతి 5 కిలోమీటర్ల దూరానికి ఒక ఆసుపత్రి సౌకర్యం కల్పించాలి..
* ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక ఆర్థిక వనరులు, జీవనోపాధి కల్పించాలి….
పై డిమాండ్ల సాధనకు మునుగోడు ఉపఎన్నికల కు వచ్చే నాయకులను నిలదీయాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోరా హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఎన్. నారాయణరావు, సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, కార్యదర్శి ఎం తిరుమలయ్య, సహాయ కార్యదర్శి జాబాలి, ఎం రాజు, ఏం బాలకృష్ణ, జూపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.