పట్టాలెక్కిన తొలి హైస్పీడ్‌ రైలు

పట్టాలెక్కిన తొలి హైస్పీడ్‌ రైలు
వీడియో లింక్‌ తో జెండా ఊపిన మోడి

హైదరాబాద్‌, అక్షిత ప్రతినిధి :

తొలి హైస్పీడ్‌ రైలు సికింద్రాబాద్‌-విశాఖపట్నం
నడుమ పట్టాలెక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రధాని మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య నడువనున్న ఈ రైలును ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వీడియో లింక్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దేశంలో ఎనిమిదో వందే భారత్‌ రైలు అందుబాటులోకి వచ్చినట్లయింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్‌ రైళ్లు నడుస్తున్నాయి.

కాగా, దక్షిణ మధ్య రైల్వేలో పట్టాలెక్కిన తొలి హైస్పీడ్‌ రైలుగా చరిత్రలో నిలిచింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని 10వ నంబర్‌ ప్లాట్‌ఫారంపై జరిగిన ప్రారంభ వేడుకల్లో కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవి, కిషన్ రెడ్డి, గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ రైలు సోమవారం (ఈ నెల 16) నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఇది సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తుంది. కాగా, ఈ రైలు మార్గంమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో ఆగనుంది. ఈ రైలును గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడపనున్నారు. సికింద్రాబాద్- విశాఖ మధ్య 3.30 గంటల సమయం ఆదా కానుంది. తొలి రోజు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి 21 స్టేషన్లలో ఆగనుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఇవాళ ఒక్క రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన ఈ రైలు రాత్రి 9 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. మార్గంమధ్యలో చర్లపల్లి, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. రేపటి నుంచి రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.

రేపు విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు నంబర్ (20833) ప్రతి రోజు ఉదయం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. కేవలం 8 గంటల్లో విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు. ఇక తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. రాత్రి 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైలు మార్గంమధ్యలో వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.

ఈ రైలులో మొత్తం 16 బోగీలు ఉంటాయి. వీటిలో 14 ఏసీ చైర్ కార్లు. రెండు బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ కారు కోచ్ లు. ఎగ్జిక్యూటివ్ ఏసీ కార్ కోచ్ లో 104 సీట్లు ఉంటాయి. ఇక ఎకానమీ క్లాస్ లో 1,024 సీట్లు ఉంటాయి. మొత్తంగా ఈ రైలులో ఒకేసారి 1,128 మంది ప్రయాణించవచ్చు.

ఛార్జీల వివరాలు.. ఏసీ చైర్‌ కార్‌ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు – రూ. 1,720
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 625
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 960
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 1,115
విశాఖపట్నం నుంచి వరంగల్‌ – రూ. 1,310

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 1,665
సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి – రూ. 1,365
సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 905
సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు – రూ. 750
సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ – రూ. 520

ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ ఛార్జీ
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌ వరకు – రూ. 3,170
విశాఖపట్నం నుంచి రాజమండ్రికి – రూ. 1,215
విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 1,825
విశాఖపట్నం నుంచి ఖమ్మం వరకు – రూ. 2,130
విశాఖపట్నం నుంచి వరంగల్‌ – రూ. 2,540

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు – రూ. 3,120
సికింద్రాబాద్‌ నుంచి రాజమండ్రికి – రూ. 2,485
సికింద్రాబాద్‌ నుంచి విజయవాడ జంక్షన్‌ వరకు – రూ. 1,775
సికింద్రాబాద్‌ నుంచి ఖమ్మం వరకు – రూ. 1,460
సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌ – రూ. 1,005

Leave A Reply

Your email address will not be published.

Breaking