
పంచాయతీ ఆదాయానికి గండి
నకిలీ రసీదులు సృష్టించి అక్రమాలు
ఇష్టారాజ్యంగా సెక్రెటరీ ఉష
అక్షిత న్యూస్, ఘట్కేసర్ :
నకిలీ రసీదులు సృష్టించి అక్రమాలతో పంచాయితీ ఆదాయానికి గండి పడింది. సెక్రెటరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బిల్ కలెక్టర్లకు నకిలీ రసీదులు అంటగంటి అక్రమాలకు తెరలేపారు. అక్రమాలకు కళ్లెం వేయాల్సిన అధికారే అక్రమ మార్గాన్ని ఎంచుకొని పంచాయితీ ఆదాయానికి గండి కొడుతుంది. అక్రమాలకు పాల్పడుతున్న గ్రామ సెక్రెటరీ ఉష తప్పుడు రికార్డు సృష్టించి బురిడీ కొట్టిస్తున్నారంటూ వార్డు సభ్యుల ఆరోపిస్తుండ్రు. ఘట్కేసర్ మండల పరిధి ఎదులాబాద్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న పలు అక్రమాలపై ఎంపిఓ నందకిషోర్ శుక్రవారం పలు రికార్డులు పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయితీలో సర్పంచ్ ప్రోద్బలంతో కార్యదర్శి, బిల్ కలెక్టర్లు అడ్డదారిలో అనుమతులతో పాటు నకిలీ రసీదులు ఇస్తూ అక్రమ నిర్మాణ దారుల నుండి పంచాయతీకి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారని, వార్డు సభ్యులు చేసిన పిర్యాదులతో గత వారం రోజుల క్రితం జిల్లా పంచాయతీ అధికారి పంచాయతీలో రికార్డులు పరిశీలించిన విషయం తెలిసిందే. తిరిగి శుక్రవారం అకస్మిక తనిఖీకి వెళ్ళిన ఎంపిఓ నందకిషోర్ అక్కడ ఉన్న ఉపసర్పంచ్ ఉప్పులింగేశ్వర్ రావు, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఆంజనేయులు, గణేష్, సురేష్ లు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ గ్రామ పంచాయితీకి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నారని, రికార్డులు మార్చుతున్నారని, తము అడిగిన రికార్డులు ఇవ్వడం లేదంటూ మరోమారు ఎంపిఓకు వినతి పత్రం అందజేశారు. ఏడాది కాలంలో గ్రామ పంచాయితీకి 20 లక్షలకు పైగా ఆదాయానికి గండికొట్టారని ఆరోపించారు. ఎంపిఓ ముందు కార్యదర్శి, ఉపసర్పంచ్ మద్య వాగ్వివాదం జరగడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అక్రమాలకు పాల్పడిన వారిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని పాలకవర్గం సభ్యులు డిమాండ్ చేశారు. సర్పంచ్, కార్యదర్శి అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారంటూ మరోమారు స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్త్యలకు ఉపసర్పంచ్ ఉన్న లింగేశ్వర్ రావు ఆధ్వర్యంలో వార్డు సభ్యులు శ్రీనివాస్, అంజనేయులు, గణేష్, సురేష్ లు కలెక్టరేట్ ఛాంబర్ లో వినతి పత్రం అందజేశారు.