ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్

ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్
మంచిర్యాల, అక్షిత బ్యూరో:-
పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యం అక్రమ రవాణా పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ తెలిపారు. మంగళవారం జిల్లాలోని మందమర్రి మండలం రవీంద్రఖని రైల్వేస్టేషన్లో ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించి, అక్రమంగా తరలించేందుకు బస్తాలలో సిద్ధంగా ఉన్న దాదాపు 20 క్వింటాల ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యంను స్వాధీనపర్చుకొని, మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్ లో భద్రపరిచి, తదుపరి చర్యలకై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అక్రమదారులు దుర్భాషలాడుతూ అధికారులపై రాళ్ళతో దాడికి పాల్పడగా, అక్రమదారులను గుర్తించి, సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని మండల తహశిల్దార్ సంపతి శ్రీనివాస్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యం వ్యాపారం చేయకూడదని, అక్రమ రవాణాకు పాల్పడకూడదన్నారు.నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.