ఆకలి కడుపులను
అక్కున చేర్చుకొని
కాలే కడుపులకు
అన్నం పెట్టిన ముంబాయి
టీయూడబ్ల్యూజే – ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు కె విరాహత్ అలీ
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
ముంబైలో తెలుగు సంస్కృతి అనేది కేవలం సంప్రదాయాల సమాహారం మాత్రమే కాదని, అది ఒక జీవన విధానం, ఒక భావోద్వేగ బంధమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ అన్నారు.
ముంబైలో దాదాపు 12లక్షల మంది తెలుగు వాసులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర మహాసభ సంస్థ, దాదర్ లో మూడు రోజుల పాటు సాంస్కృతిక సంబరాలను కనుల పండగలా నిర్వహిస్తుంది. ఈ సభలకు శనివారం రోజు వక్తగా హాజరైన విరాహత్ అలీ… *”ముంబాయి మహానగరం -* *తెలుగు ప్రజలతో బంధం”* అనే అంశంపై ప్రసంగించారు. మాడిపోయిన కడుపులు చేత బట్టుకొని, ఆకలితీర్చే దారులు వెతుక్కుంటూ, కన్నీళ్ళతో బయలుదేరిన తెలుగు బిడ్డలకు.. తన దారి చూపించి, అక్కున చేర్చుకొని, కన్నీళ్లను తూడ్చి, ఆకలితీర్చిన ముంబాయి తల్లి రుణం వెల కట్టలేనిదన్నారు.

ముంబై తో తెలుగు ప్రజలకు దాదాపు మూడు వందల సంవత్సరాల బంధం ఉందని, నాడు మహారాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం కోసం మరాఠిలు చేసిన మహా ఉద్యమంలో తెలుగు ప్రజలు భాగస్వామ్యమై, ప్రాణ త్యాగం చేసిన చేసిన చరిత్రను విరాహత్ అలీ గుర్తుచేసారు. స్వస్థలానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తెలుగు ప్రజలు తమ భాషను, కళలను, పండుగలను, కుటుంబ విలువలను కాపాడుకుంటూ, ముంబై నగర సాంస్కృతిక వైవిధ్యాన్ని మరింత సుసంపన్నం చేయడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతికి ముంబై ఒక ముఖ్యమైన కేంద్రంగా వెలుగొందడం, తెలుగు జాతికి గర్వకారణమన్నారు. ముంబైలో తెలుగు ప్రజల భవిష్యత్తు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ, భాషా పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం, యువత భాగస్వామ్యం, ఆర్థిక స్థిరత్వం వంటి అంశాలు కీలక సవాళ్లుగా నిలుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సవాళ్లను సమిష్టిగా ఎదుర్కొని, సంఘటితంగా ముందుకు సాగితేనే ముంబైలో తెలుగు సమాజం మరింత బలపడుతుందన్నారు. తమ మూలాలను కాపాడుకుంటూనే ఆధునిక ప్రపంచ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా తెలుగు ప్రజలు భవిష్యత్తులో కూడా ముంబై అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంటుందని విరాహత్ అలీ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, తెలుగు కవి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ముంబై ఆంధ్ర మహాసభ అధ్యక్షులు బి. కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.