నాడు విధ్వంసం… నేడు వికాసం

నాడు విధ్వంసం
నేడు వికాసం

ప్రగతి దిశగా
  పటిష్ట వ్యూహం

అడ్డంకులు దాటి
  అభివృద్ధి లక్ష్యం

కారు షెడ్డుకే
 పొలిమేర దాటనివ్వం

కోహెడ అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ తెలంగాణ వ్యవసాయ రంగానికి కొత్త దిశ

రైతుల ఆదాయ వృద్ధి,
వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులే ప్రభుత్వ లక్ష్యం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

రంగారెడ్డి, అక్షిత బ్యూరో :

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో విధ్వంసం చవిచూడగా..నేడు తెలంగాణ వికాసం దిశగా పటిష్ట అడుగులు వేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి, ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ కాంప్లెక్స్ కు శనివారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసారు.

రంగారెడ్డి జిల్లా కోహెడలో అంతర్జాతీయ సమీకృత ఫ్రూట్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించడంతో పాటు రైతులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

గతంలో రైతులు పండించిన పండ్లు, కూరగాయలు, పాలు హైదరాబాద్ నగర ప్రజల అవసరాలను తీర్చేవని, అయితే పట్టణీకరణ మరియు రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా వ్యవసాయ భూముల విస్తీర్ణం తగ్గిందన్నారు.

ప్రస్తుతం కోటి ముప్పై లక్షలకు పైగా జనాభా కలిగిన హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆహార అవసరాలను తీర్చేందుకు ఆధునిక వ్యవసాయ మౌలిక వసతులు అవసరమని తెలిపారు.గతంలో తాత్కాలిక షెడ్లలో నిర్వహించిన మార్కెట్‌లో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తూ, రైతులకు భద్రతతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తామన్న హామీ మేరకు 240 ఎకరాల్లో ఆధునిక ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ విమానాశ్రయం తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పండ్లు, కూరగాయల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని, కందుకూరు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే టమోటా ఆధారంగా సాస్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రైతులకు మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తామని తెలిపారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన నిధులను గ్రీన్ ఛానల్ ద్వారా విడుదల చేస్తామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి మార్కెట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండు సంవత్సరాల్లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థలను అక్కడకు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, వరంగల్ మరియు ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి వంటి కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి సమీకృత ఆధునిక కార్యాలయ సముదాయాల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్రానికి భారీ ఆదాయం వస్తోందని, ఆ ఆదాయానికి అనుగుణంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, వరి పంటకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి నమోదైందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో భాగంగా రాష్ట్రంలో 15 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రైతులకు రూ.20 వేల కోట్ల రుణమాఫీ, మహిళలకు వడ్డీ రాయితీతో బ్యాంకు లింకేజ్ రుణాలు, మహిళల ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని, తెలంగాణను దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి,చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు,శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్ ఏ లు మల్ రెడ్డి రంగా రెడ్డి , వీర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్ ,కసిరెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్లు చంద్రా రెడ్డి, కిరణ్మయ, గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking