కొయ్యలకు నిప్పు…పంటలకు ముప్పు..!
– అజాగ్రత్తతో బుగ్గి అవుతున్న రైతుల కష్టం
– అప్రమత్తతతోనే మేలు
– రైతులు వరికోయలకు నిప్పు పెట్టొద్దు
– రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు
రామన్నపేట అక్షిత ప్రతినిధి
రైతులు ఎండిన వరికోయలకు, ఇంటి పరిసరాల్లో ఉన్న చెత్తాచెదారానికి నిప్పు పెట్టవద్దని రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం వీస్తున్న వేడి గాలుల కారణంగా చిన్న మంటలు కూడా వేగంగా వ్యాపించి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వరికోయలకు నిప్పు పెట్టడం వల్ల మంటలు సమీపంలోని ఇండ్లు, గడ్డివాములు, వ్యవసాయ పొలాలకు వ్యాపించి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ చేతులారా ప్రమాదాలను కొనితెచ్చుకోవద్దన్నారు.ప్రకృతిని కాపాడితే అది మన ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్న ఆయన.. గ్రామాలను పచ్చగా, సురక్షితంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇకపై ఎవరైనా వరికోయలకు నిప్పు పెడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు స్పష్టం చేశారు.