
గోదావరికి కాళేశ్వరం…
కృష్ణాకు ఏలేశ్వరం
పర్యాటక ప్రాంతాలుగా పరిడవిల్లాలి
తెలంగాణాలో నల్లమల అంచున, నల్లగొండ జిల్లాకొసన, నాగార్జున సాగర్ జలాశయం చివరిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యం వుంది. కొండలు గుట్టలు, వాగులు వంకలు, గుహలు జలపాతాలు, లోయలు అన్ని రకాల అందాలు కనువిందు చేస్తున్నాయి… గత సమైక్యవాద సీమాంధ్రుల పాలనలో ఇవన్నీ మరుగున పడ్డాయి… ఇప్పుడిప్పుడే ఒకటొకటి వెలుగులోకి వస్తున్నాయి… కాచరాజు అద్భుతమైన బెడేం రంగుల గుహలు , చిన్నమునిగల్ దగ్గర సాగర్ జలాశయంలో పడవల ప్రయాణం, పోగిళ్ల దగ్గర జలపాతాలు ఇవ్వన్నీ ఈ మధ్య కాలంలో ప్రజలను ఆకర్షించి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంది. దీనితో ప్రభుత్వం కూడ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుంది.
ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఏలేశ్వరం, నిడిగల్, కాచ రాజుపల్లి, మునిగల్ లాంటి చారిత్రక గ్రామాలు వుండేవి. అవి జలాశయంలో మునిగి పోయినవి, నల్లమల ఆ చివర సంగమేశ్వరం నుoచి నడిబొడ్డులో సలేశ్వరం మీదుగా ఈ చివర ఏలేశ్వరం వరకు ఒక గొప్ప, మూలవాసుల వనమూలికల అటవీ రాజ్యం వుండేది..
ప్రభుత్వం ఈ ప్రాంత అస్తిత్వాన్ని, చరిత్ర ని గుర్తించి ఈ ప్రాంతానికి ఏలేశ్వరం, కాచరాజుపల్లి, నిడిగల్, మునిగల్ పేర్లలో ఏదో ఒక పేరుతో ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, సమైక్య వలస వాదులు కాలనీల పేరు వాడొద్ధని. ఇప్పుడు వైజాగ్ కాలనీగా పిలుస్తున్న ఆ గుట్ట ప్రాంతానికి పేరుందని. గుర్తించి ఇక్కడి మూలవాసుల చెంచుల స్థానికపేర్లను వాడాలని, ప్రభుత్వ వెబ్సైట్ నుంచి , రికార్డ్స్ ల నుంచి మరో రాష్ట్ర పట్టణాన్ని (వైజాగ్)సూచించే, ఆధునిక నగరవాడ(కాలనీ) సూచించే పేర్లను తొలగించి, తెలంగాణా, నల్లమల, కృష్ణానదితో ముడి వేసుకున్న పూర్వ చారిత్రక గ్రామాల పేరు పెట్టాలని ఎవరూ కూడా వైజాగ్ కాలనీ వాడకూడదని మనవి. స్థానిక శాసన సభ్యులు, లోకసభ సభ్యులు, శాసనమండలి సభ్యులకు , మంత్రులకు అధికారులకు మనవి..భవిష్యత్తులో కొత్త నియోజక వర్గాలు ఏర్పడితే , దానికీ ఈ పేరే (ఏలేశ్వరం, కాచరాజుపల్లి, నిడిగాల్) పెట్టాలని మనవి.
మీ
మట్టిమనిషి
వేనేపల్లి పాండురంగారావు