
ప్రీతి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
-బీఎస్పీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
మెడికల్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీ ఖమ్మం అసెంబ్లీ ఇన్చార్జి అయితగాని శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వపరంగా ఎన్నో వ్యవస్థలు యంత్రాంగం ఉన్నప్పటికీ అవేవీ బాధ్యతాయుతంగా పని చెయ్యకపోవడం వల్ల పాలకులు అధికారుల ఉదాసీనత ఒక ఉన్నత విద్యావంతురాలిని వేధింపులకి బలి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ప్రీతి తండ్రి రైల్వే పోలీస్ విభాగంలో ఏఎస్ఐ స్థాయిలో ఉన్న ఉద్యోగి అయినప్పటికీ వేధింపులకి సంబంధించి తగిన ఆధారాలతో ఆయన ఇచ్చిన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోలేదంటే రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం పనితీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది స్పష్టమవుతోంది అన్నారు. షీ టీమ్స్ పెట్టామని మహిళల రక్షణకు పెద్ద పీట వేశామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ సర్కారు ఈ ఘటనపై వెంటనే స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేయాలని లేకుంటే బీఎస్పీ పార్టీ ఆందోళనలు చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ప్రీతి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.