బండీ ఖబడ్దార్…

బండీ ఖబడ్దార్…
* నోరు అదుపులో పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలు
* ఎమ్మెల్సీ కవితకు, తెలంగాణ మహిళా సమాజానికి బండి బహిరంగ క్షమాపణలు చెప్పాలి
* మిర్యాలగూడలో బండి దిష్టి బొమ్మ దహనం, నిరసన చేపట్టిన మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన బండి సంజ‌య్‌ నోరు అదుపు పెట్టుకోకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు తిరునగర్ భార్గవ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితకు, తెలంగాణ మహిళా సమాజానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశానుసారం, మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు నిర్దేశానుసారం స్థానికంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో తిరునగర్ భార్గవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆయన దహనం చేశారు. అనంతరం తిరునగర్ భార్గవ్ మాట్లాడారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. మహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్ప‌డింద‌న్నారు. ఈడీ ఏం చేసేది బీజేపీ నేత‌లకు ముందే ఎలా తెలుస్తుంది? అని ప్ర‌శ్నించారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలనడానికి బీజేపీ నేతల ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనం అని పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదురిస్తే కేసులు పెడతారా? ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన తాము భ‌య‌ప‌డం. బీజేపీతో ఏదైనా తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది అని భార్గవ్ స్ప‌ష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగర్ నాగలక్ష్మీ భార్గవ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, ఖాదర్, పత్తిపాటి నవాబ్, ఎల్లమ్మ, కందగట్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking