తెలంగాణ ప్రగతి… దేశానికి ఐకాన్

దేశానికే రోల్ మాడల్ తెలంగాణ
* ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తాయి
* ‘మోడీ హఠావో…దేశ్ కో బచావో’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి
* బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలి
* అబ్ కీ బార్…కిసాన్ కీ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్
* బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలి 

ఎమ్మెల్సీ కడియం శ్రీహరి 

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మాడల్ గా నిలుస్తోందని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నల్లగొండ జిల్లా ఇంఛార్జీ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు పార్టీ శ్రేణుల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.

మిర్యాలగూడ పట్టణంలో శ్రీమన్నారాయణ పంక్షన్ హాల్ లో వేములపల్లి మండలానికి చెందిన బీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు.’మోడీ హఠావో…దేశ్ కో బచావో’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.

అబ్ కీ బార్…కిసాన్ కీ సర్కార్ నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందజేస్తున్న ప్రతీసంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కార్యకర్త ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కులాలు,మతాల మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నాలు చేసేందుకు కొందరు వస్తారని వారిని నమ్మవద్దని కోరారు.

శ్రుతి మించుతున్న బీజేపీ దుర్మార్గాలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఉన్న శక్తి సామర్ధ్యాలు ప్రత్యర్థులకు ఏ మాత్రం లేవని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో 9ఏండ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దశ, దిశ, నిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరెక్కడా అమలుకావడం లేదన్నారు.

వచ్చే నెల 20వరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ ఎండగట్టాలని పిలుపునిచ్చారు. బీజేపేతర పాలిత రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సీబీఐ, ఈడీ, ఐటీ దాడులను కేంద్ర ప్రభుత్వం తమ స్వార్ధ రాజకీయాల కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటున్నాడో ప్రజలకు తెలియజేయాలని కోరారు. అనంతరం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సందేశాన్ని కార్యకర్తలకు ఆయన చదివి వినిపించారు.

తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాష్ట్రం అవిర్భవించక ముందున్న పరిస్థితులు, రాష్ట్ర ఏర్పడ్డాక మారిన ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని కార్యకర్తలకు అర్ధమయ్యే విధంగా కడియం శ్రీహరి వివరించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ముగిసిన తర్వాత వచ్చేనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నిర్ణయించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు వచ్చేనెల 27న ప్రతి గ్రామంలోని వార్డుల్లో జెండా పండుగ ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, రైతు బంధు సమితి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వేములపల్లి మండల పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడు నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, ధర్మపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కృపాకర్ రావు, బీఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్దార్ధ, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి షోయబ్, కట్టా మల్లేష్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, గ్రామపార్టీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, మహిళలు, యువకులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking