కోళ్ళ పెంపకంతో
దళితుల ఆర్థిక ప్రగతి
అత్యద్భుతం… మంచి ఫలితాలు
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :
దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధు ఉద్దీపనగా మారిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడలో దళిత బంధు పథకం కింద ఏర్పాటు చేసిన కోళ్ళ పెంపకం యూనిట్ ను పురోగతిని పరిశీలించారు.

ఇద్దరు దళితుల ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న యూనిట్ మంచి రిజల్ట్స్ ఉన్నాయని, ఆయా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో 31 కోళ్ళ పెంపకం యూనిట్లను మంజూరు చేయగా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కోళ్ళ పెంపకం యూనిట్ల ప్రగతి సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని, మరిన్ని యూనిట్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

నల్గొండ పట్టణంలో మినీ సూపర్ మార్కెట్ మంచి బిజినెస్ గా ముందుకు సాగుతుందన్నారు. జిల్లాలో పలు యూనిట్లను పరిశీలించి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ ను అభినందించారు.

దళితుల ఉజ్వల భవిష్యత్తుకు దళిత బంధు ఉద్దీపనగా నిలువనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే సీఎం కేసిఆర్ 2వ విడత దళిత బంధు యూనిట్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తారని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.