క్రైస్తవుల ఐఖ్యతకై రన్ ఫర్ జీసస్
జ్యోతినగర్ లో మైనంపల్లి ర్యాలీ జెండావిష్కరణ
నేటి ర్యాలీ ప్రారంభానికి మైనంపల్లి రాక
మల్కాజిగిరి, అక్షిత ప్రతినిధి :
క్రీస్తు పునర్థానుడు… మరణాన్ని జయించి తిరిగి లేచిన సంకేతాన్ని చాటేందుకు రన్ ఫర్ జీసస్ ఉపయుక్తంగా ఉంటుందని రన్ ఫర్ జీసస్ ఆర్గనైజర్స్ బి.సామ్యూల్, సి హెచ్ ప్రదీప్ లు అన్నారు. శుక్రవారం స్థానికంగా మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవుల ఐఖ్యతను చాటేందుకు అంతా కదిలి రావాలని కోరారు. ప్రపంచ మానవాళి రక్షణార్ధం క్రీస్తు బలియాగమ య్యారన్నారు. మానవాళి పాప పరిహారార్ధం క్రీస్తు తన ఆత్మను అర్పించుకు న్నారన్నారు. క్రీస్తు ప్రేమను చాటేందుకు క్రైస్తవులంతా ఐఖ్యంగా ముందుకు సాగాలని వారు కోరారు. క్రీస్తు తనకు తానుగా అర్పించుకునే క్రమంలో సిలువపై సప్త స్వరాలను పలికి సర్వ మానవాళి మనుగడకు ఆదరణ కర్తగా ఉన్నారన్నారు.
క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచారన్న సంకేతాన్ని చాటేందుకు రన్ ఫర్ జీసస్ చేపడుతున్నట్లు చెప్పారు. యునైటెడ్ మల్కాజిగిరి పాస్టర్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునిత రామ్ యాదవ్ లు హాజరుకానున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 6 గంటలకు మల్కాజిగిరి జ్యోతినగర్ గ్రౌండ్ లో మైనంపల్లి హన్మంతరావు జెండాను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. రన్ ఫర్ జీసస్ ను విజయవంతం చేసేందుకు ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రార్థించి, ఆసక్తి కలిగిన వారు రన్ ఫర్ జీసస్ లో భాగస్వామ్యులు కావాలని వారు కోరారు.