బక్రీద్ పండుగకు పటిష్ట బందోబస్తు
కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు
క్షేత్రస్థాయిలో ‘నాఖాబంది’ని స్వయంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం.
కరీంనగర్ అక్షిత బ్యూరో
నేడు రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగం అత్యంత పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను కాపాడేందుకు కమీషనరేట్ పరిధిలోని అన్ని కీలక ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు, నాఖాబంది నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం క్షేత్రస్థాయిలో పర్యటించి, నగరంలో జరుగుతున్న నాఖాబంది కార్యక్రమాన్ని, వాహన తనిఖీలను స్వయంగా పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ:”ప్రజలందరూ బక్రీద్ పండుగను అత్యంత ప్రశాంతమైన, సోదరభావ వాతావరణంలో జరుపుకునేలా చూసేందుకే ఈ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాం. కమీషనరేట్ పరిధిలో భద్రతను కట్టుదిట్టం చేశాం. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించి, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలి.”అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. పండుగను శాంతియుతంగా ముగించేందుకు ప్రజలు, అన్ని వర్గాల నాయకులు పోలీస్ శాఖకు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.