ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు
ఆందోళన వ్యక్తం చేస్తున్న లారీ డ్రైవర్లు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
ఇతర ప్రాంతాల ధాన్యం కొనుగోలుపై జిల్లా యంత్రాంగం ఆంక్షలు విధించడంతో ధాన్యం సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రదానంగా ఏపీ నుంచి మిల్లర్లు తక్కువ ధరకి ధాన్యం కొంటూ ఇక్కడ ఉత్పత్తి అయిన ధాన్యంకి కూడా అంతే ధర చెల్లిష్టమంటున్నారు. రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తుండడం తో కలెక్టర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ధాన్యం రాకుండా కట్టడి చేస్తున్నారు. అయితే విషయం తెలియని లారీ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్గేట్ వద్ద ఇతర జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను మిర్యాలగూడ వైపుకు రానివ్వకుండా పోలీస్ రెవిన్యూ అధికారులు అడ్డుకోవడంతో సుమారు 150 కు పైగా ధాన్యం లారీలు టోల్గేట్ వద్ద నిలిచిపోయాయి. రాత్రి నుంచి ధాన్యం లారీలను అడ్డుకోవడంతో డ్రైవర్లు ఆందోళనకు దిగి చెక్పోస్ట్ వద్ద ఉన్న అధికారులతో వాగ్వివాదం చేశారు. తమకు ముందస్తు సమాచారం లేక లారీలలో పచ్చిధాన్యం తెచ్చమని, వెంటనే మిల్లులకు తరలించకపోతే కుళ్లిపోయి నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పక్క జిల్లాలకు చెందిన ధాన్యం లారీలను అడ్డగించడం ఎంతవరకు సమంజసం అని రైతులు సైతం ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు తక్షణమే స్పందించి తమ ధాన్యం మిల్లులకు తరలించె అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.