ఫ్రీడం ఫైటర్ కు భూ కేటాయింపు
ఆక్రమణలోకి పక్క పట్టే దారులు
అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు
జర్నలిస్టులకు కేటాయించేందుకు యోచన
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
కబ్జాకు కాదేది కనర్హం. ఫ్రీడం ఫైటర్ కు కేటాయించిన భూమి హక్కు దారు సాగులోకి రాకపోవడంతో కబ్జాల పర్వం ఊపందుకుంది. ఆరున్నర ఎకరాల భూమికి గాను సుమారు సగం భూమిని పక్క పట్టేదారులు అక్రమించేశారు. మిగిలిన భూమిని సైతం కబ్జా చేసేందుకు ఉపక్రమించిన తరుణంలో కొన్నేళ్లుగా ఇళ్ల స్థలాలకై ఆందోళన చేస్తున్న జర్నలిస్టులకు బిపిఎల్ కోటాలో ఇచ్చేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కాగా కొంతమంది అడ్డుతగులుతూ జర్నలిస్టుల ప్రయత్నాలకు ఆటకాయింపు కల్గిస్తుండ్రు. వివరాల్లోకి వెళితే…నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ హైదలాపూర్ బేచిరాగ్ శివారులోని సర్వే నెంబర్ 5లోని ప్రభుత్వ అసైన్డ్ భూమి ఆక్రమణకు గురవుతూ వస్తుంది. 1989లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు సిరికొండ రామచంద్రరాజుకు సుమారు 6.20 ఎకరాల భూమిని మంజూరు చేస్తూ పట్టా ఇచ్చారు. పట్టా తీసుకున్న స్వాతంత్ర్య సమర యోధుడు కేటాయించిన భూమిని వినియోగించుకునేందుకు ముందుకు రాకపోవడంతో
ఖబ్జాల పర్వం ప్రారంభమైంది. సుమారు మూడు ఎకరాలు ఖబ్జాకు గురి కాగా సుమారు ఎకరం భూమిని పరిసర ప్రాంతాల పొలాలకు దారిగా వాడుకుంటున్నారు. దశాబ్దంన్నర కాలం దాటినా భూ హక్కు దారులెవరు రాక పోవడంతో ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తున్న మిర్యాలగూడ జరలిస్టులకు కేటాయించేందుకు అధికార యంత్రాంగం సిద్దమైంది. ఈ తరుణంలో అధికార యంత్రాంగానికి మరి కొంతమంది మా భూమి ఉందంటూ అడ్డు తగులుతుండ్రు. అడ్డు తగిలే వారికి అక్కడ భూమి లేదని రెవెన్యూ అధికారులు సర్వేలో తేల్చారు. ఆయా భూమిలో అడుగడుగునా అటకాయిస్తున్నప్పటికి రెవెన్యూ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రెవిన్యూ అధికారులు పట్టించుకోకుంటే ఆ కాస్తా భూమి కూడా ఖబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది. ఎన్నో ఏళ్లుగా జర్నలిజం వృత్తిని కొనసాగిస్తూ సేవలందిస్తున్న సుమారు 100 మందికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర జర్నలిస్టులకు కేటాయించేందుకు అధికారులు ఉపక్రమించారు. అడ్డు తగిలే వారి ఆటలకు కళ్లెం వేసి జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మిర్యాలగూడ జర్నలిస్టులు కోరుతున్నారు.