కిసాన్ నేత కేసీఆర్

కిసాన్ నేత కేసీఆర్

*ఆయన సంకల్ప బలంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రగతి

* కేసీఆర్ విజన్ తోనే
విద్యుత్ వైభవం

* సాగుకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

* కేసీఆర్ పక్కా ప్రణాళికతో విద్యుత్ సామర్థ్యం పెంపు

* మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు… మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు

* కాంగ్రెస్ పై కర్షకుల కన్నెర్ర
* టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని రైతుల డిమాండ్, ఏకగ్రీవ తీర్మానాలు

* మిర్యాలగూడలో రైతు వేదికల వద్ద నిర్వహించిన సదస్సుల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలు…24గంటలు అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. రేవంత్ తీరుపై తెలంగాణ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. భారీ ర్యాలీలు నిర్వహించి రేవంత్ చిత్రపటాలకు పిండప్రదానం చేశారు. అన్నదాతల పట్ల చులకన భావంతో మాట్లాడిన రేవంత్ తీరుపై కర్షకులు కన్నెర్ర చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, రాష్ట్ర ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుల్లో రైతులు స్వచ్చందంగా పాల్గొన్నారు. మూడు పంటల బీఆర్ఎస్ నినాదమే ముద్దు… మూడు గంటల కాంగ్రెస్ విధానం వద్దు అంటూ రైతులు నినదించారు. ఈ మేరకు బీఆర్ఎస్ నిర్వహించిన సదస్సుల్లో ఏకగ్రీవ తీర్మానాలను ప్రవేశపెట్టారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతు వేదికల వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించిన సదస్సుల్లో శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ విద్యుత్ కష్టాలను అధిగమించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ కోసం ఊరూరా అరిగోస పడేవారని అన్నారు. సాగుకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పునరుద్ఘాటించారు.

కేసీఆర్ సంకల్ప బలంతోనే తెలంగాణ రాష్ట్రం అబ్బురపరిచే ప్రగతి సాధిస్తోందన్నారు. సమైఖ్య పాలనలో విద్యుత్ తీగలు పట్టుకొని రైతుల గుండెలు ఆగిపోయేవని అన్నారు.నాడు అన్నదాతల పొలాల్లో కాలిపోయే మీటర్లు…పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు కనిపించేవని చెప్పారు. కండ్ల ముందే పంటలు ఎండటంతో ఎన్నో గుండెలు ఆగేవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత 39,321 కోట్ల రూపాయలతో ట్రాన్స్ మిషన్, డిస్కం లను బలోపేతం చేసిన మహనీయుడు కేసీఆర్ అని భాస్కర్ రావు అభివర్ణించారు. పక్కా ప్రణాళికతో ఆయన విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచారని అన్నారు.మూడేండ్లలో రైతన్న కరెంట్ కష్టాలను తెలంగాణ అధిగమించిందన్నారు. రైతును రాజును చేయాలనే దృఢ సంకల్పంతో కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఒక‌ప్పుడు క‌రెంటు క‌ష్టాల‌కు కార‌ణ‌మే కాంగ్రెస్‌. అస‌మ‌ర్థ‌, దుష్ట పాల‌న వ‌ల్ల రైతులు అరిగోస ప‌డ్డారు. అందుకే ఆ పార్టీకి ప్ర‌జ‌లు చ‌ర‌మ‌గీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు. వ్య‌వ‌సాయానికి కేవలం 3 గంట‌ల క‌రెంటు చాల‌ట‌. వ్య‌వ‌సాయం గురించి తెలిసినోడు మాట్లాడే మాట‌లేనా? కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్య‌ల‌తో రైతులు న‌వ్వుకుంటున్నారు. న‌వ్వుల‌పాలైన ఆ పార్టీని పాతాళంలో పాతి పెట్టాల‌ని భాస్కర్ రావు నిప్పులు చెరిగారు.కాంగ్రెస్ పార్టీ మూర్ఖంగా మాట్లాడుతున్నది. తప్పుడు ప్రచారాలు చేస్తున్నది. ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నదని మండిపడ్డారు. దున్న‌పోతు ఈనింది అంటే.. దొడ్లో క‌ట్టేయ‌మ‌న్న‌ట్లు కాంగ్రెస్‌ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో వ్య‌వ‌సాయ రంగాన్ని నిర్ల‌క్ష్యం చేసిన పాప‌ం కాంగ్రెస్‌ పార్టీదేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయే మోటార్లు, స్టాటర్లు, ఎండిపోయిన పైర్లు అసెంబ్లీలో ప్రదర్శించి, అల్లరి చేసే పరిస్థితి నాడు ఉండేది. వాటితోనే అసెంబ్లీ దద్దరిల్లేది. వ్యవసాయం దండుగ అనేది. ఎరువులు, విత్తనాల కొరత, నకిలీలు, సాగునీరు లేక, కరెంట్ రాక అంతా ఆగమాగం ఉండేది. రైతులు అత్మహత్యలు చేసుకునే దుర్మార్గ పాలన అనాడు సాగింది. ఎండాకాలంలో గ్రామాల‌కు రావాలంటేనే ప్ర‌జాప్ర‌తినిధులు భ‌య‌ప‌డేవారు అని ఆనాటి ప‌రిస్థితుల‌ను భాస్కర్ రావు రైతుల‌కు వివ‌రించారు.అందుకే 60 ఏండ్ల కాంగ్రెస్ పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడారని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ చేశారన్నారు. రైతులను ఇబ్బందిపెట్టే కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతులు కర్రుకాల్చి వాతపెట్టాలని సూచించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్… చంద్రబాబుకు ఏజెంట్ గా పనిచేస్తున్నారని భాస్కర్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో టీఎస్ ఆగ్రోస్ ఛైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చిట్టిబాబు నాయక్, వైస్ ఎంపీపీ అమరావతి సైదులు, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు తిరుపతమ్మ, బిక్షం గౌడ్, మండల రైతు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాక్స్ చైర్మన్ శాగం ఆదిరెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వెలిశెట్టి రామకృష్ణ, చలికంటి యాదగిరి, బిక్ష నాయక్, బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, రైతులు, పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking