జేఎన్ జేహెచ్ఎస్ బాధితులకు న్యాయం చేయండి*

*జేఎన్ జేహెచ్ఎస్ బాధితులకు న్యాయం చేయండి*

విరాహత్ అలీ

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సుదీర్ఘకాలంగా ఇళ్ల స్థలాల కోసం వేచి చూస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ(జేఎన్ జేహెచ్ఎస్ ) సభ్యులకు స్థలాన్ని అప్పగించి, 1100 జర్నలిస్టుల కుటుంబాలకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యుజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ ప్రభుత్వాన్ని కోరారు.
మంగళవారం నాడు జేఎన్ జేహెచ్ఎస్ బాధిత జర్నలిస్టులు ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. జేఎన్ జేహెచ్ఎస్ సొసైటీని, 2008లో ఉమ్మడి రాష్ట్రంలో తమ యూనియన్ ఏపీయుడబ్ల్యుజె స్థాపించిందని, అంతేకాకుండా, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ను ఒప్పించి, దాదాపు1100 మంది సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం నిజాంపేట్, పేట్ బషీరాబాద్ లో 70 ఎకరాల స్థలాన్ని సాధించినట్లు విరాహత్ స్పష్టం చేశారు. అయితే దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి కోర్టు నుండి స్టే తీసుకురావడంతో ఏళ్ల తరబడి అది పెండింగులో ఉండిపోయిందన్నారు. ఆగస్టు 25, 2022న సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దానిని అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. 15ఏళ్ల క్రితమే ఆర్థిక స్థోమత లేకున్నా, కొందరు సభ్యులు వడ్డీతో అప్పులు తెచ్చి, మరికొందరు ఉన్న ఆస్తులను అమ్ముకొని తమ వాటా క్రింద ఒక్కొక్కరు 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 12కోట్ల,33లక్షల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ సొసైటీనీ కొన్ని శక్తులు హైజాక్ చేసి, సభ్యులకు న్యాయం జరగకుండా అడ్డుపుల్లలు వేయడం సహించారనిదన్నారు.

జేఎన్ జేహెచ్ఎస్ సొసైటీ సభ్యులకు వెంటనే స్థలాన్ని అప్పగించడంతో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఏళ్ల తరబడి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న మరో 3 వేల మంది అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టాలని విరాహత్ అలీ కోరారు. ఈ మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాల ఇంచార్జ్ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్యెల్సీ రామచందర్ రావు, టీపీసీసీ సీనియర్ నాయకులు వి.హన్మంతరావు, మల్లు రవి, ఓపిడిఆర్ నాయకురాలు వి.సంధ్య, సుప్రసిద్ధ గాయని విమల, హెచ్ యూజే అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్, జేఎన్ జేహెచ్ఎస్ నాయకులు రమణ రావు, అశోక్ రెడ్డి తదితరులతో పాటు దాదాపు 300 మంది సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking