మూసీకి ముంచెత్తిన వరద
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ ఆర్ వి కర్ణన్
కేతేపల్లి, అక్షిత న్యూస్ :
మూసీ ప్రాజెక్టుకు భారీగా నీటి వరద వస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. శుక్రవారం నాడు ఆయన మూసీ ప్రాజెక్టు సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం వద్ద మూసీ ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. 8 గేట్లను 4 ఫీట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇన్ ఫ్లో 25,365 క్యూసెక్కులు కాగా, అవుట్ ఫ్లో 38,595 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు ఉండగా, ప్రస్తుత సామర్థ్యం 641.0 అడుగుల వరకు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 3.42 టీఎంసీలుగా ఉన్నట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు, అధికారులు జిల్లా కలెక్టరుకు వివరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రజలకు అన్ని విధాలుగా సహాయంగా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వరద ఉధృతి పెరుగుతున్న మూసీ తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, జంతువులను కూడా ఆయా ప్రాంతాలలో సంచరించకుండా చూడాలన్నారు.

ముంపుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలలో అధికారులు, పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కేతపల్లి మండలం ముంపు గ్రామాల ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు. సూర్యాపేట నుండి మిర్యాలగూడకు వెళ్లే రహదారిలో బొప్పారo గ్రామం వద్ద రోడ్డు నీటిలో మునిగిపోయినందున రాకపోకలను పూర్తిగా బంద్ చేయడం జరిగిందని తెలిపారు.
తిరుగు ప్రయాణంలో నకిరేకల్ తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. నియోజకవర్గానికి సంబంధించిన ఆర్వో ఆఫీస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నందున ఖాతాదారులను క్యూలో ఉంచకుండా ఏటీఎం కార్డులను జారీ చేసి సులభతరం చేయాలని పోస్టల్ అధికారులను కోరారు.
అనంతరo జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఐటీ టవర్ ను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుష్బూ గుప్తా, నల్గొండ రెవిన్యూ డివిజనల్ అధికారి రవి, తహశీల్దార్లు ప్రసాద్, మధుసూధన్, ఇరిగేషన్ ఇంజనీర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
.