ముఖ్యమంత్రి సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలి
* బాధిత కుటుంబానికి మంజూరైన రూ.10 లక్షల విలువైన ఎల్ఓసీ చెక్కు పంపిణి
* మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
అక్షిత ప్రతినిధి, మిర్యాలగూడ :
ఆపదలో ఉన్న వారంతా ముఖ్యమంత్రి సహాయనిధిని (సీఎంఆర్ఎఫ్) సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరమని అన్నారు. నల్లగొండ జిల్లాలో మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడ్గులపల్లి మండలంలో ఇస్కబావి గూడెం గ్రామానికి చెందిన వెంకటమ్మ గత కొద్ది రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్ఎల్ఏ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన భాస్కర్ రావు…. ముఖ్య మంత్రి సహాయనిధి నుంచి వెంకటమ్మ కు రూ.10లక్షల ఎల్ఓసీ చెక్కును మంజూరు చేయించి పంపిణీ చేశారు. ఎల్ఓసీ చెక్కు పంపిణీ చేసిన అనంతరం భాస్కర్ రావు మాట్లాడారు. ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవుడని అన్నారు. ఆపద సమయంలో వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి నుంచి అందే సాయం ఆపథ్బంధువులా ఆదుకుంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందని అన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయని అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు.