రామన్నపేట ఆర్‌అండ్‌బీ కార్యాలయం లో అంబేద్కర్‌కు అవమానం.. 

అంబేద్కర్‌కు అవమానం.. 

– చినిగిన జెండాతో దేశానికి అవమానం

– ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద ఘటనపై టీడీపీ మండల అధ్యక్షుడు ఎండీ పజల్ బేగ్ ఆగ్రహం

రామన్నపేట, అక్షిత ప్రతినిధి:

రామన్నపేట మండల కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయం వద్ద స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేయకుండా, కేవలం మహాత్మా గాంధీ చిత్రపటానికి మాత్రమే మాల వేసి కార్యక్రమం నిర్వహించడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎండీ పజల్ బేగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇవ్వకపోవడం ఆయనను అవమానించడమేనని పేర్కొన్నారు. జాతీయ సమైక్యత, సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్‌ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.అదే విధంగా రామన్నపేట గ్రంథాలయం వద్ద చినిగిన జాతీయ జెండాను ఎగురవేయడం తీవ్ర అభ్యంతరకరమని పజల్ బేగ్ అన్నారు. జాతీయ జెండాకు అత్యంత గౌరవం ఇవ్వాల్సిన సమయంలో చినిగిన జెండాను ఎగురవేయడం దేశ గౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.“ఇదేనా మన దేశానికి మీరు ఇస్తున్న గౌరవం? జాతీయ జెండా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎండీ పజల్ బేగ్ డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking