త్రివర్ణ వర్ణాలతో విద్యార్థుల సందడి.. దేశభక్తి చాటిన నృత్య ప్రదర్శన
ఉప్పల్ అక్షిత ప్రతినిధి, ఆగస్టు 15
ఉప్పల్‌లోని ప్రజ్ఞాన్ ది స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలకు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. త్రివర్ణ పతాకాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక దుస్తులు ధరించిన విద్యార్థులు ఉత్సాహంగా నృత్య ప్రదర్శనలు చేసి అలరించారు. 5వ తరగతి విద్యార్థి బొమ్మ సాత్విక్ నాయకత్వంలో విద్యార్థులు సమన్వయంతో చేసిన నృత్య ప్రదర్శనకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల ప్రదర్శనలో దేశభక్తి, ఐక్యత, జాతీయ స్ఫూర్తి ప్రతిబింబించడంతో కార్యక్రమానికి హాజరైన వారు అభినందించారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శకుంతల, ఉపాధ్యాయులు అరుణ, నళిని, ఎలిజబెత్, సువర్ణ, శ్రావంతి, రోజా, నవనీత, నాగమణి తదితరులు విద్యార్థుల ప్రదర్శనలను అభినందించారు. నృత్య ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులతో పాటు 5వ తరగతి విద్యార్థి నాయకుడు బొమ్మ సాత్విక్‌ను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.