మత సామరస్యానికి ప్రతీకగా గణేష్, మిలాదున్ నబీ పండుగలు

మత సామరస్యానికి ప్రతీకగా
గణేష్, మిలాదున్ నబీ పండుగలు

కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
నల్గొండ, అక్షిత ప్రతినిధి :

మత సామరస్యానికి ప్రతీకగా శాంతి యుత వాతావరణంలో జిల్లాలో వినాయక చవితి, మిలాదున్ నబీ పండుగలు జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వినాయక చవితి పండుగ నిర్వహణపై శాంతి సంఘం కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భిన్నత్వంలో ఏకత్వంగా ఒకరి పండగలను, ఆచారాలను వేరొకరు గౌరవిస్తూ పండగలను ప్రశాంతంగా నిర్వహించడం మన జిల్లా ప్రత్యేకత అని, వచ్చే వినాయక చవితి, మిలాద్ నభి పండుగలను అందరూ ప్రశాంత,శాంతియుత వాతావరణం లో నిర్వహించుకునేలా సహాయ సహకారాలు అందిం చుకోవాలని కలెక్టర్‌ సూచించారు. వినాయక చవితి 18న ఉన్నందున ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ప్రశాంత వాతావరణం లో పండుగలు జరుపుకోవాలని ప్రజలను కోరుతూ అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అందులో భాగంగా రోడ్ల మరమ్మతులు, స్ట్రీట్ లైట్స్, విద్యుత్ వైర్లు సరిచేయడం, మొదలగు పనులు సంభందిత అధికారులు వెంటనే చేయాలన్నారు. అదే విధంగా మునిసిపల్, పంచాయతీ లలో పారిశుధ్య చర్యలు, నిమజ్జనం చేసే ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిమజ్జనం ఏర్పాట్లు, ఇతర శాఖల అధికారులను సమన్వయ పరిచే బాధ్యత అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చూడాలని కోరారు.

గణేష్ ఉత్సవాలలో భాగంగా ప్రతి గణేష్ మండపం వద్ద తులసి మొక్కలను పంపిణీ చేయాలని కలెక్టర్ నిర్వహుకులకు విజ్ఞప్తి చేశారు. తులసి చెట్టు ప్రాముఖ్యత ఉన్నందున మనం జిల్లాలో తులసి మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. అందుకు నిర్వహకులు సహకరించి మొక్కల పంపిణీ నీ విజయవంతం చేయాలన్నారు. తులసి మొక్కలు మునిసిపల్, పంచాయతీ శాఖ సిబ్బంది అందజేస్తారు అని ఆయన అన్నారు.

గణేష్ ఉత్సవాలకు మట్టి విగ్రహాలను మొదటి ప్రాధాన్యత నివ్వాలని, అందుకు నిర్వాహకులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.

సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులపై అప్రమత్తంగా ఉండాలని, అసత్య వార్తలను నమ్మి ప్రచారం చేయవద్దని కోరారు. ఏమైనా సమస్యలుంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సోషల్‌ మీడియాలో మతాలను, వ్యక్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని తెలిపారు.

గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం తేది నిర్ణయించి జిల్లా వ్యాప్తంగా ఒకే తేదీన నిమజ్జనం జరిగేలా చొరవ చూపాలన్నారు.

ఎస్పీ అపూర్వ రావు మాట్లాడుతూ, గణేష్ విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలని ఆమె తెలిపారు. ప్రతి విగ్రహం వద్ద విధిగా ఫైర్ సేఫ్టీ మొదలగు అంశాలకు ప్రాధాన్యతలు ఇవ్వాలని ఆమె కోరారు. ప్రతి గణేష్ మండపాన్ని జియో టాకింగ్ ద్వారా అనుసంధానం చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గణేష్ మండపాల వద్ద విధిగా కమిటీ సభ్యులతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారని ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తూ బందోబస్తును పర్యవేక్షిస్తామని ఆమె తెలిపారు.

కార్యక్రమంలో ముందుగా ఇటీవల మృతి చెందిన పీస్ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు ఓరుగంటి రాములు మృతి చెందిన సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లు హేమంత్ కేశవ్ పాటిల్, జె. శ్రీనివాస్, శాంతి కమిటీ సెక్రెటరీ హఫీజ్ ఖాన్,సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, సలీం, పిచ్చయ్య, నర్సిరెడ్డి, హషం, గౌస్ మొయినుద్దీన్, గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు నేతి రఘుపతి, కార్యదర్శి మామిడి శ్రావణ్, ఆర్డీవోలు రవి, చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking