*టీయూడబ్ల్యూజేతో బంధం* *ఈనాటిది కాదు*
*-మంత్రి హరీష్ రావు*
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)తో తన బంధం ఈనాటిది కాదని, దాదాపు రెండు దశాబ్దాల నుంచే ఈ సంఘ నాయకత్వంతో తనకు ఆత్మీయ బంధం కొనసాగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
(టీయూడబ్ల్యూజే) జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైందని పేర్కొన్నారు. యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినప్పటికీ, జర్నలిస్టులు మాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. జర్నలిస్టుల స్థితిగతులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.1997లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంత విలేకరులకు అప్పటి రవాణా శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ మెదక్ ఉమ్మడి జిల్లా విలేకరులకు సిద్దిపేటలో బస్ పాస్ లు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్లాది రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జర్నలిస్టులకు 25 వేల అక్రిడిటేషన్ కార్డులు మంజూరైతే, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 22 వేల అక్రెడిటేషన్ కార్డులను అందజేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 262 మంది జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి తాను చేయూతను అందించినట్లు హరీష్ రావు చెప్పారు.

జర్నలిజం వృత్తి టెన్షన్ తో కూడుకున్నదని, ఇందుకుగాను జర్నలిస్టులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ విషయంలో టీయూడబ్ల్యూజే నాయకత్వం కార్యాచరణ రూపొందించాలని ఆయన సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటికే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 70 శాతం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేశామని, మిగిలిన చోట్ల త్వరలోనే పూర్తి చేయనున్నట్లు హరీష్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోగ్య పథకాన్ని మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జర్నలిస్టులు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లలో మరిన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. అనంతరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, రాజకీయంలో తాను ఈ స్థాయికి ఎదగడం వెనుక జర్నలిస్టుల సహకారం ఎంతో ఉందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ, కవి గాయకుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమంలో మెదక్ జిల్లా జర్నలిస్టు సంఘానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతూనే మరోవైపు సామాజిక స్పృహతో ప్రజా సమస్యలపై పోరాడిన గొప్ప చరిత్ర ఉందన్నారు. అప్పటి ప్రభుత్వాలు మెదక్ జిల్లాలో జర్నలిస్టు సంఘాన్ని తుద ముట్టించడానికి ఎన్ని కుట్రలు పన్నినా ఇక్కడి జర్నలిస్టులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. ఆ రోజుల్లో మెదక్ జిల్లా జర్నలిస్టుల సంఘం ఉద్యమాల స్ఫూర్తి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ, ఆరోగ్య పథకం అమలుకు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి హరీష్ రావును కోరారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టులు పొందుతున్న సంక్షేమ ఫలాలన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఏపీయుడబ్ల్యుజె, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీయూడబ్ల్యూజే పోరాటాల ఫలితమే అన్నారు. పోరాటాలు, త్యాగాల కలయికతోనే టీయూడబ్ల్యూజే ఆవిర్భవించిందని విరాహత్ స్పష్టం చేశారు. 13,600 సభ్యత్వాలతో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తూ దేశంలో అగ్రగామిగా తమ సంఘం నిలబడడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. జిల్లా అధ్యక్షుడు కే. రంగాచారీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్యెల్సీ దేశపతి శ్రీనివాస్, జెడ్పి చైర్ పర్సన్ రోజా శర్మ, జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన 400 మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.