తెలంగాణ బడుగు, బలహీనవర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ
* మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటాన్ని నడిపిన కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ బడుగు, బలహీనవర్గాల చైతన్యానికి ఆత్మగౌరవానికి ప్రతీక అని మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పేర్కొన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి (సెప్టెంబర్ 27) సందర్భంగా ఆయన తెలంగాణకు అందించిన సేవలను, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో ఆయన చేసిన పోరాటం నాటి తరాన్ని ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు. ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా ఎన్నో పదవులను నిర్వహించిన బాపూజీ, తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించి నిబద్ధత కలిగిన నేతగా చరిత్రలో నిలిచారని అన్నారు. బాపూజీ ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం తన కార్యాచరణ ద్వారా నెరవేరుస్తున్నదని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని స్పష్టం చేశారు.ఆయన సంస్మరణార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తూ ఆయనకు నివాళి అర్పిస్తున్నదని భాస్కర్ రావు తెలిపారు.