మిక్కికి అండగా ఉంటా
మాదిగలు పారిశ్రామిక ప్రగతి సాధించాలి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తo
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
మాదిగలు పారిశ్రామిక ప్రగతి సాధించాలని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తo అన్నారు. మిక్కి (మాదిగ ఇంటిగ్రేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) కి అండగా ఉంటానన్నారు. ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఏర్పుల నరోత్తoను శనివారం మిక్కి వ్యవస్థాపక అధ్యక్షులు సుంచు రాజు కుమార్, మిక్కి వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించిన పిదప మిక్కి ఆవిర్భావo, ఆవశ్యకతపై ఛైర్మన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసిఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, ప్రగతి దిశగా పనిచేస్తున్నారన్నారు.

ఎస్సీల సంక్షేమం కోసం పలు పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా దళితుల ఆర్థిక పరిపుష్టికి దళిత బంధును పటిష్ఠ వoతంగా అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రత్యేకంగా మాదిగలు పారిశ్రామిక ప్రగతి సాధించేందుకు ఉద్భవించిన మిక్కితో మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. మాదిగలకు పారిశ్రామిక రంగంలోనూ సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. మిక్కి అభివృధ్దికి తమ వంతు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిక్కి రాష్ట్ర కమిటీ సభ్యులు కే. శ్రీనివాస్, గుమ్మడి సతీష్, వి. సత్యేంద్ర కుమార్, అవునూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.