హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
*దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం వున్నదని సీఎం అన్నారు.
విజయానికి చిహ్నంగా దసరా పండుగను ‘విజయ దశమి’ పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం తెలిపారు.దసరా నాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం అన్నారు.
శమిపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలాయ్ బలాయ్ తీసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు, అగ్రపథాన కొనసాగించేందుకు విజయ దశమి స్ఫూర్తితో అలుపెరుగని ప్రయత్నం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.
తెలంగాణకు నిత్య విజయాలు కలిగేలా దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై వుండాలని, ప్రజలందరికీ సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం శ్రీ కేసీఆర్ దుర్గామాతను ప్రార్థించారు.