ఆన్లైన్ నమోదు జాగ్రత్తగా చేయాలి
– జిల్లా కలెక్టర్ జెడెంగే హనుమంతు కొడింబా సూచన
– ప్రారంభమైన శిక్షణా తరగతులు
యాదాద్రి భువనగిరి, అక్షిత ప్రతినిధి :
ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టరు హనుమంతు కే.జెండగే డాటా ఎంట్రీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం నాడు కలెక్టరేటు సమావేశ మందిరంలో ప్రజాపాలన దరఖాస్తులను ఆన్లైన్ నమోదు చేసేందుకు డేటా ఎంట్రీ సిబ్బందికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ద్వారా అభయ హస్తం క్రింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు పథకాలపై ఆన్లైన్ నమోదు చేసే విధానంపై రిపోర్స్ పర్సన్స్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రజలు దరఖాస్తులో పేర్కొన్న ప్రకారం మాత్రమే వివరాలను ఆన్లైన్ నమోదు చేయాలని, నమోదు అనంతరం ప్రివ్యూ చూశాక సబ్మిట్ చేయాలని, అనంతరం వచ్చిన నెంబరును సంబంధిత దరఖాస్తుపై తప్పనిసరిగా వ్రాయాలని సూచించారు. డాటా ఎంట్రీ చేసిన తరువాత మీకిచ్చిన దరఖాస్తులను తిరిగి జాగ్రత్తగా సంబంధిత సూపర్వైజర్లకు అందచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు జి.వీరారెడ్డి, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు ఏ.భాస్కరరావు, జిల్లా పంచాయితీ అధికారి సునంద, శిక్షణా రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.