అభివృద్ది…సంక్షేమం  ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ది…సంక్షేమం  ప్రభుత్వ ధ్యేయం
మునిపల్లిలో రూ.8.15 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు…
–రూ.5.35 కోట్ల నిధుల మంజూరుకు మంత్రి హామీ….
–కంకోల్‌లో రూ.2.50 కోట్లతో నూతన పీహెచ్‌సీకి శంకుస్థాపన…
–16 గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వైద్య సేవలు…
–హామీలన్నింటికి కట్టుబడి ఉన్నాం….
–రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
అందోలు, అక్షిత ప్రతినిధి:
రాష్ట్ర ప్రజల సంక్షేమం…అభివృద్ది…ప్రతి ఒక్కరికి విద్యా…వైద్యం అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. ఆదివారం అందోలు నియోజకవర్గంలోని మునిపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మునిపల్లిలోని మోడల్‌ స్కూల్‌ను, బాలికల హస్టల్‌ను సందర్శించిన ఆయన విద్యార్థినీలతో ముఖాముఖి చేపట్టి, వారి సమస్యలను, అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను, బాలికల హస్టల్‌ గదులను పరిశీలించారు. మోడల్‌ స్కూల్‌ భవనానికి, మరమ్మత్తులకు రూ.64.50 లక్షలు, బాలికల హస్టల్‌ భవన పెండింగ్‌ నిర్మాణ పనులకు రూ.60 లక్షల పనులకు శంకుస్థాపన చేశారు. మోడల్‌ స్కూల్‌ ను గతంలో తాను ఉప
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించడం జరిగిందన్నారు. మోడల్‌ స్కూల్‌ ను మరింత అభివద్ధి చేయడానికి, బాలికల హాస్టల్‌ లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు రూ. 85 లక్షల అదనపు నిధులను మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.

దీనికి సంబంధిత అంచనా ప్రతిపాదనలను సిద్దం చేయాలని, ఈ పనులకు పాఠశాలల ప్రారంబానికి ముందే పనులను పూర్తి చేసి, విద్యార్థులకు అన్ని వసతులను కల్పించాలని టిఎస్‌ఇ డబ్లు్యఐడిసీఈఈ కి ఆదేశించారు. మునిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మీకంగా సందర్శించిన మంత్రి పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో పాత భవనాన్ని పూర్తిగా తొలగించి, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణానికి కావలసిన అంచనా ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను అదేశించారు. ఇందుకోసం రూ.4.50 కోట్ల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. మునిపల్లి మండలం బుదేరా జూనియర్‌ కళాశాల, డిగ్రీ కళాశాల నుండి మెయిన్‌ రోడ్డు వరకు, ఎన్‌హెచ్‌– 9 నుండి ఆర్‌అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వరకు రూ.60 లక్షలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కంకోల్‌ గ్రామంలో రూ.2.50 కోట్ల నిధులతో కొత్తగా నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు. పిహెచ్సి ఏర్పాటుతో 16 గ్రామాల ప్రజలకు సేవలందుతాయని, రానున్న దసరా పండుగ నాటికి పీహెచ్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి, డాక్టర్లు నర్సులు, స్టాఫ్‌ ను ఏర్పాటు చేసుకుందామన్నారు. పెద్ద చెల్మెడ లో జిల్లా పరిషత్‌ పాఠశాల నూతన భవనానికి రూ.4.35 కోట్లు కేటాయించగా, ఈ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తాటిపల్లి కస్తూర్భాగాంధీ పాఠశాలలో రూ.37 లక్షలతో చేపట్టనున్న రూఫ్, బాత్రమ్స్‌ పైపు లైన్,సెఫ్టిక్‌ ట్యాంక్‌ మరమ్మత్తుల పనులకు శంకుస్థాపన చేశారు. రెసిడెన్షియల్‌ కళాశాలకు కేటాయించిన స్థలాన్ని పూర్తి సర్వే చేయించి, బౌండరీలు ఫిక్స్‌ చేయాలని, రిపేర్లు అదనపు గదుల నిర్మాణం, కాంపౌండ్‌ వాల్‌ , గేటుకు ఏర్పాటుకు, క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన అంచనా ప్రతిపాదనలు తయారు చేసి ఇవ్వాలని మంత్రి సంబంధిత అధికారులకు సూచించారు.

వాగ్ధానాలన్నింటికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

దామోదర్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలన్నింటీని నేరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. త్వరలోనే ఆరు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని, ప్రజలేవ్వరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం అమల్లోకి రాగా, 200 యూనిట్‌ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్‌ సీలిండర్‌ అమల్లోకి మరి కొద్ది రోజుల్లోనే రానున్నట్లు ఆయన తెలిపారు. ఇళ్ల స్థలాలు, అందరికి ఇండ్లు ఇవ్వడమే తరువాయన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందని, మీ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. మునిపల్లి మండలం తాను గతంలో చేసిన పనులే కనిపిస్తున్నాయని, గత పదేళ్లుగా అభివృద్దికి దూరంగా ఉందన్నారు.
ప్రతి గ్రామంలో పిల్లలకు ప్రమానికమైన విద్యానందించాలని, అందుకు పాఠశాలలకు కావలసిన మౌలిక వసతుల కల్పన అభివద్ధి చేయాలన్నా సంకల్పంతో ఆయా పనులు చేపడ్తున్నట్లు తెలిపారు. నూతన పాఠశాల భవనంలో అంగన్‌ వాడీ భవనాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్య, ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రధాన ధ్యేయమన్నారు. ముఖ్యంగా బాలికల చదువుపై ప్రత్యేక దష్టి సారిస్తున్నామన్నారు. ఈ ప్రాంత అభివద్ధి, పిల్లల చదువు, ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో డిఇఓ వెంకటేశ్వర్లు, టిఎస్‌ఇడబ్లు్యఐడిసిఈఈ శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్డిఓ రవీందర్‌ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ గాయత్రి దేవి, ఆయా కళాశాలల, పాఠశాలల ప్రిన్సిపాల్‌లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు, మునిపల్లి ఎంపీపీ, జడ్పిటిసి, ఇతర ప్రజాప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking