న్యాయంకై రోడ్డెక్కిన
కోట్లాది కార్మికులు
*-టీయుడబ్ల్యూజే నేత విరాహత్ అలీ*
హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, కార్పొరేట్ విధానాలపై చార్జ్ షీట్ ప్రకటిస్తూ ఇవ్వాళ దేశవ్యాప్తంగా 50కోట్ల మంది కార్మికులు రోడ్డెక్కారంటే, దేశంలో అచ్ఛేదిన్ ఎక్కడున్నాయో? స్పష్టమైపోతుందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజే) నేత కే.విరాహత్ అలీ విమర్శించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ, కార్మిక, రైతు, ప్రజాస్వామ్య హక్కుల సాధనకై, శుక్రవారం నాడు ఇందిరాపార్కు వద్ద “జాయింట్ ప్లాట్ ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్” నిర్వహించిన కార్మికుల సమ్మెకు టీయూడబ్ల్యూజే పక్షానా సంఘీభావం ప్రకటించి ఆయన ప్రసంగించారు.

కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కార్మిక లోకం 27సార్లు సమ్మెకు దిగిందని, గత సమ్మెల్లో దాదాపు 30కోట్ల మంది కార్మికులు భాగస్వామ్యమైతే, ఇవ్వాళ జరుగుతున్న సమ్మెలో 50కోట్ల మంది కార్మికులు పాల్గొనడం బట్టి చూస్తే కార్మిక, కర్షకుల సంక్షేమం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి అర్థమైపోతుందని విరాహత్ అలీ ఎద్దేవా చేశారు. దేశంలో ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తెస్తున్న మార్పులు-చట్టాలు భూమి నుండి, వ్యవసాయం నుండి రైతులను దూరం చేసి, కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెంచడానికేనన్నారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి కల్పన క్షిణించి పోయిందని, శ్రామికుల నిజ వేతనాలు 20శాతం తగ్గాయని, ప్రపంచంలోని 125 దేశాల్లో ఆకలిలో మన దేశం 111వ స్థానంలో ఉండడం విచారకరమని విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సమ్మె కార్యక్రమంలో ఐఎన్ టియూసి, ఎఐటియూసి, సిఐటియూ, బిఆర్ టియు తదితర కార్మిక సంఘాలకు చెందిన వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.