దళితుల భూములకు ముప్పు… విస్తరణ వద్దు..
సాగర్ సిమెంట్స్ మైనింగ్ విస్తరణ
17 న సాగర్ సిమెంట్స్ మైనింగ్ విస్తరణ పబ్లిక్ హియరింగ్
మఠంపల్లి, అక్షిత న్యూస్ :
సాగర్ సిమెంట్స్ మైనింగ్ విస్తరణ దళితుల భూములకు ముప్పు పొంచి ఉంది. ఈ విస్తరణతో వెదజల్లే కాలుష్యం…సాగుకు అనుకూలంగా ఉన్న భూములు సారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మా భూములకు ముప్పు వాటిల్లే సాగర్ సిమెంట్స్ మైనింగ్ విస్తరణ వద్దు అంటూ దళితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.40 ఏళ్లుగా సాగర్ సిమెంట్స్ ఉన్నప్పటికీ స్థానికులకు ఎలాంటి ఉపాధి లేదని దళితులు మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులను మచ్చిక చేసుకొని ఈ నెల 17న ప్రజాభి ప్రాయ సేకరణకు ముహూర్తం ఖరారు చేశారు.

వివరాల్లోకి వెళితే…మఠంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాగర్ సిమెంట్ పరిశ్రమ సున్నపు రాయి గని యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.8 నుండి 5.4 యంటిపిఏకు పెంచుటకు, వీటితో పాటు 1×1000 టిపిహెచ్ క్రషర్ ను నెలకొల్పుటకు ప్రస్తుతం ఉన్న లీజ్ ఏరియా అయిన 328.58 హెక్టార్ లలో సున్నపు రాయి గనిని విస్తరించుటకు ఈనెల 17 న ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ కొరకు అధికారుల సమక్షంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నారు.

పెదవీడు రెవెన్యూ పరిధిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు తీవ్ర వ్యతిరేఖత చూపిస్తున్నారు. మైనింగ్ నిర్వహణకు అతి దగ్గరలోనే దళితుల సాగుకు అనుకూలంగా ఉన్న పంట పొలాలు ఉండటంతో మైనింగ్ నుంచి వచ్చే కాలుష్యం వలన భవిష్యతులో తమ భూమి కూడా సారాన్ని కోల్పోతాయని భూగర్భ జలాల సామర్థ్యాలు తగ్గుతాయని వాపోతున్నారు. పరిశ్రమ ఏర్పడి 40ఏళ్లు అవుతున్నప్పటికీ సంబంధిత గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి సహకరించలేదని విద్యా అర్హతలు ఉన్న స్థానికులకు తగిన ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.

ఈ పరిశ్రమ వల్ల తమకు ఎలాంటి ఉపయోగం లేదని మైనింగ్ విస్తరణకు అభ్యంతరం తెలిపారు.ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలంగాణ, సూర్యాపేట జిల్లా కలెక్టర్, జడ్పీ సీఈఓ, జిల్లా పరిశ్రమ శాఖకు ఫిర్యాదులు చేశామని అన్నారు.ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.